కొన్ని రోజులుగా డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్‌ల మధ్య ప్రత్యక్ష, పరోక్ష వ్యాఖ్యల పోరు ఎలా సాగుతోందో తెలిసిందే. ఇద్దరూ కలిసి తమ అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఐతే ఈ సినిమా మేకింగ్ దశలోనో, ఆ తర్వాతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఇన్నేళ్లు అవి బయటపడలేదు కానీ.. మొన్న ‘గబ్బర్ సింగ్’ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ‘గబ్బర్ సింగ్’కు సంబంధించి హరీష్ లేటెస్టుగా పెట్టిన థ్యాంక్స్ నోట్లో బండ్ల పేరు ప్రస్తావించకపోవడంతో మొదలైంది గొడవ.
తర్వాత ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గురించి మరీ తేలిగ్గా మాట్లాడేశాడు బండ్ల. అతను రీమేక్‌లతో తప్ప హిట్లు కొట్టలేడని.. ఇంకా ఏవో కామెంట్లు చేశాడు. దీనికి హరీష్ శంకర్ కూడా దీటుగా స్పందించాడు. ఇద్దరి మధ్య ట్విట్టర్లో ‘కోట్స్’ వార్ కూడా జరిగింది.
కట్ చేస్తే ఇప్పుడు బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో హరీష్ విషయంలో కొంచెం స్వరం మార్చాడు. అతడితో మీ గొడవేంటి అని అడిగితే.. ‘‘ఏదో ఆవేశంలో మాటా మాటా అనుకుంటాం. అంతకుమించి ఏమీ లేదు. హరీష్ శంకర్ గ్రేట్ డైరెక్టర్. నాకు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. ఇంతకన్నా ఏం చెప్పాలి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే బెటర్’’ అనేశాడు.
ఉన్నట్లుండి హరీష్ఉ శంకర్ గురించి బండ్ల ఇంత పాజిటివ్‌గా మాట్లాడటం ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ ఛానెల్ యాంకర్‌కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో మళ్లీ హరీష్ శంకర్‌తో సినిమా చేస్తారా మరి అని అడిగితే.. ‘‘ఛాన్సే లేదు. హరీష్ శంకర్‌తో ఎప్పటికీ సినిమా చేయను. ఒక సినిమా చేశాం. చాలు’’ అన్నాడు బండ్ల. మరి పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు అంటే.. ‘‘దేవుడు వరమిస్తే చేస్తాం. మనం అనుకుంటే జరగదు’’ అన్నాడు.
ఇంతకీ ‘గబ్బర్ సింగ్’ విజయానికి త్రివిక్రమ్ మూల కారణం అని ఎందుకన్నారని అడిగితే.. తాను ‘దబంగ్’ రీమేక్ హక్కులు కొని పవన్‌తో ఆ సినిమా చేద్దామని అనుకుంటుంటే.. తనతో ఆ సినిమా చేయమని పవన్‌కు చెప్పింది త్రివిక్రమే అని, అందుకే ఆయనకు క్రెడిట్ ఇచ్చానని చెప్పాడు బండ్ల.