‘క్రాక్’ సెంటిమెంట్ రిపీట్!

ఒక కాంబినేషన్ లో సినిమా హిట్ అయిందంటే చాలు.. మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా చేయాలనుకుంటారు. నటీనటులు, టెక్నీషియన్స్ ను రిపీట్ చేస్తుంటారు. ఇండస్ట్రీ జనాలకు ఉన్న సెంటిమెంట్లే దానికి కారణమని చెప్పాలి. అయితే ఇలా సెంటిమెంట్ రిపీట్ చేసిన ప్రతీసారి హిట్ అయితే రాలేదు. అయినప్పటికీ సినీ జనాలకు నమ్మకం అయితే పోలేదు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తీయనున్న సినిమా కోసం ‘అల వైకుంఠపురంలో’ సినిమా టెక్నీషియన్స్ ను రిపీట్ చేస్తున్నారు.

ఇప్పుడు బాలకృష్ణ సినిమా విషయంలో కూడా అలానే చేస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు గోపీచంద్ ‘క్రాక్’ టీమ్ మొత్తాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నారు. దాదాపు ‘క్రాక్’ టెక్నికల్ టీమ్ మొత్తం బాలయ్య సినిమాకి పని చేయనుంది.

వీరితో పాటు ‘క్రాక్’ సినిమాలో విలన్ గా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ను కూడా బాలయ్య సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ రోల్ మాత్రం కాదు. ఓ కీలకపాత్రలో ఆమె కనిపించనుంది. అలానే ‘క్రాక్’ సినిమాలో నటించిన కొందరిని బాలయ్య సినిమాలో రిపీట్ చేయనున్నారని సమాచారం. మరి ఇన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతున్న గోపీచంద్ మలినేని ఏ రేంజ్ లో హిట్ కొడతారో చూడాలి!