సుకుమార్ శిష్యుడితో విశ్వక్ సేన్!

‘వెళ్లిపోమాకే’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు విశ్వక్ సేన్. ఆ తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఫలక్ నుమా దాస్’ అనే సినిమాతో దర్శకుడిగా కూడా మారారు. గతేడాది ‘హిట్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేతుల్లో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టినట్లు సమాచారం. టాలీవుడ్ లో ఉన్న యంగ్ రైటర్లలో ప్రసన్న ఒకరు. రీసెంట్ గా ఇతడు విశ్వక్ సేన్ కోసం కథ సిద్ధం చేసినట్లు సమాచారం.

యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథలను రాయడంతో ప్రసన్నకు మంచి పేరుంది. దర్శకుడు త్రినాథరావు నక్కినతో కలిసి పని చేస్తుంటారు ప్రసన్న. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘హలో గురు ప్రేమకోసమే’,’నేను లోకల్’ వంటి సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రవితేజ కోసం కథను సిద్ధం చేస్తున్నారు. అలానే ప్రసన్న సెపరేట్ గా ఓ కథను రెడీ చేసుకొని విశ్వక్ సేన్ కు వినిపించారట.

కథలో కొత్తదనం, యూత్ కి నచ్చే పాయింట్స్ ఉండడంతో విశ్వక్ సేన్ వెంటనే ఓకే చెప్పేశారట. కానీ ఈ సినిమాకి దర్శకుడు త్రినాథరావు కాదట. వేరే డైరెక్టర్ సూర్య ప్రతాప్ చేతుల్లో ఈ కథ పెట్టబోతున్నారని సమాచారం. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన ఈ దర్శకుడు గతంలో ‘కుమారి 21 ఎఫ్’ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కొన్నిరోజుల్లో విదులయ్యే ఛాన్స్ ఉంది. సూర్య ప్రతాప్ తదుపరి చిత్రంగా విశ్వక్ సేన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. రైటర్ ప్రసన్న స్వయంగా సూర్య ప్రతాప్ పేరుని సూచించినట్లు సమాచారం.