భారీ అంచనాల మధ్య నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్. తొలి సీజన్‌కు దీటైన కథాకథనాలు.. ఉత్కంఠభరిత ఎపిసోడ్లు, ఫన్నీ సీన్లు, బలమైన ఎమోషన్లతో సెకండ్ సీజన్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. అన్ని వైపులా ఈ సిరీస్‌కు మంచి రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో మంచి ఫీడ్ బ్యాక్ కనిపిస్తోంది.
ఐతే తమిళ జనాలు మాత్రం అనుకున్నట్లే ఈ సిరీస్ పట్ల అభ్యంతరాలను కొనసాగిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి తమ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎల్టీటీఈ తీవ్రవాదులు.. పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినట్లుగా ఇందులో చూపించారు. ఇది కల్పిత గాథ అని పేర్కొన్నప్పటికీ.. టైగర్ల పట్ల సానుభూతి, ఆరాధన భావం ఉన్న తమిళులకు ఈ సిరీస్ రుచించట్లేదు. దీని పట్ల తమ వ్యతిరేకతను కొనసాగిస్తున్నారు. రాజి పాత్ర చేసిన సమంతను టార్గెట్ చేస్తున్నారు.
ఐతే ఈ వివాదం మీద కొన్ని రోజులుగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న చిత్ర బృందం.. సైలెంటుగా సిరీస్‌ను రిలీజ్ చేసేసింది. ఐతే విడుదల తర్వాత మళ్లీ ఎక్కడ వివాదం రాజుకుంటుందో అని సమంతను రంగంలోకి దించారు. ఆమె రాజి పాత్ర విషయంలో తన అనుభవాల గురించి ఒక నోట్ రిలీజ్ చేసింది. ఈ పాత్ర తనకు ఎంతగా సవాలు విసిరిందో వివరించింది. ఈ క్యారెక్టర్ చేసేముందు తన వంతుగా రీసెర్చ్ చేశానని.. తమిళ ఈలం సభ్యులకు సంబంధించి ఎన్నో డాక్యుమెంటరీలు చూశానని.. వాళ్లకు జరిగిన అన్యాయాల గురించి తెలుసుకుని కదిలిపోయాయని.. ఐతే ఎంతో ఉద్వేగభరితంగా ఉన్న ఆ వీడియోలకు యూట్యూబ్‌లో వేలల్లో మాత్రమే వ్యూస్ ఉండటం ఆశ్చర్యం కలిగించిందని.. వేలమంది ప్రాణాలు కోల్పోయి, లక్షల మంది నిరాశ్రయులైన ఉదంతాల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడం బాధాకరమని సమంత వ్యాఖ్యానించింది.
సమంత నిజంగా బాధపడి ఉండొచ్చు కానీ.. ఇప్పుడీ నోట్ రిలీజ్ చేయడం మాత్రం మళ్లీ వివాదం రాజుకుని ‘ఫ్యామిలీ మ్యాన్-2’కు ఎక్కడ బ్రేక్ పడుతుందో అన్న భయంతోనే అని భావిస్తున్నారు. శ్రీలంకలో అన్యాయాలకు గురైన తమిళుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం ద్వారా ‘ఫ్యామిలీ మ్యాన్-2’ పట్ల ఆగ్రహంతో ఉన్న తమిళ జనాల ఆగ్రహాన్ని తగ్గించడమే దీని ఉద్దేశమన్నది స్పష్టం.