2000 తర్వాత సౌత్ ఇండియన్ హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్ల జాబితా తీస్తే.. నయనతార, అనుష్క, సమంతలను టాప్-3లో నిలబెట్టాయాల్సిందే. ఇమేజ్ పరంగా మిగతా ఇద్దరి కంటే నయన్‌కు కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఆమె కెరీర్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా ఉన్నాయి. అందులో చాలా విజయం సాధించాయి కూడా. అనుష్క సైతం అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలతో తన పవర్ చూపించింది. కాకపోతే గత కొన్నేళ్లలో ఆమె సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. గ్లామర్ తేడా కొట్టడం వల్ల కూడా కెరీర్ కొంచెం వెనుకబడింది.
వీళ్లిద్దరినీ పక్కన పెడితే.. సమంత ఒక ప్రత్యేమైన హీరోయిన్. పై ఇద్దరు హీరోయిన్లు పీక్స్‌లో ఉన్న సమయంలో వారి గ్లామర్ ముందు సమంత నిలవజాలదు. అయినా సరే.. వారికి దీటుగా భారీ చిత్రాల్లో నటించింది. అలాగే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో అదరగొట్టింది. కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, శ్రుతి హాసన్ లాంటి తోటి హీరోయిన్లతో పోలిస్తే సమంత పెర్ఫామెన్స్ విషయంలో ఎంతో ఎత్తులో ఉంటుంది. ఆమె చేసినా పాత్రలు అలాంటివి మరి.
ముఖ్యంగా పెళ్లి తర్వాత సామ్ చేసిన ప్రతి సినిమా ఆమె ప్రత్యేకతను చాటుతూనే ఉంది. రంగస్థలం, మహానటి, ఓ బేబీ లాంటి చిత్రాలు సామ్ సత్తా ఏంటో చూపించాయి. ఇప్పుడిక డిజిటల్ డెబ్యూతో సమంత సౌత్ హీరోయిన్లందరినీ వెనక్కి నెట్టేసింది. ఇప్పటికే తమన్నా లెవెంత్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్‌లు చేయగా.. ఇందులో మొదటిది తుస్సుమంది. రెండోది ఆకట్టుకుంది. పెర్ఫామెన్స్ విషయంలో తమన్నాకు ఓ మోస్తరు మార్కులు పడ్డాయి. ‘లైవ్ టెలికాస్ట్’లో కాజల్ తేలిపోయింది. శ్రుతి హాసన్ ‘పిట్టకథలు’ గురించి చెప్పడానికేమీ లేదు.
కానీ సమంత మాత్రం ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో వావ్ అనిపించింది. ఇందులో ఆమె చేసిన రాజి క్యారెక్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఛాలెంజింగ్, డీగ్లామరస్ రోల్‌ను చేయడం అందరి వల్లా సాధ్యం కాదు. కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌గా కూడా నటించి ఆశ్చర్యపరిచిన ఆమె.. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఘట్టాల్లో అదరగొట్టింది. మొత్తంగా సమంత క్యారెక్టర్, పెర్ఫామెన్స్ ఒక ప్యాకేజీ అనే చెప్పాలి. లీడ్ రోల్ చేసిన లెజెండరీ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయికి దీటుగా నిలిచిన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా మారిన సమంత.. తనకు తానే సాటి అనిపించింది.