సీక్రెట్ గా హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!

‘అత్తారింటికి దారేది’ సినిమాతో బాపు బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రణీత సుభాష్ ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బెంగుళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని ప్రణీత ప్రేమ వివాహం చేసుకున్నారు. అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా ప్రణీత ఇంట్లోనే వివాహం జరిపించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ వివాహం గత ఆదివారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం విషయం బయట పడింది. కరోనా కారణంగా ఎవరికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. తాజాగా ఈ పెళ్లి వార్తలపై ప్రణీత స్పందించారు. ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అని స్పష్టం చేశారు. నితిన్ తనకు చాలా కాలంగా తెలుసునని.. తమ బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత ఇంట్లో విషయం చెప్పామని.. వాళ్లు కూడా తమ నిర్ణయాన్ని గౌరవించారని చెప్పుకొచ్చారు.

తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం ఇష్టం ఉండదని అన్నారు. తన పెళ్లి ఎలా జరగాలని కలలు కన్నానో అలానే జరిగిందని.. కరోనా కారణంగా ఎక్కువ మందిని పిలవలేకపోయానని వివరించారు. ఈ మధ్యనే ప్రణీతకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ‘హంగామా 2’ అలానే ‘భుజ్’ అనే చిత్రాలలో నటిస్తున్నారు. అలానే కన్నడలో ‘రమణ అవతార’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. పెళ్లి తరువాత కూడా నటిగా తన కెరీర్ ను కంటిన్యూ చేస్తారేమో చూడాలి!