నేను కథలు రాయలేను!

ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు కథల కోసం రైటర్లపై ఆధారపడుతుంటారు. కానీ ఆ విషయాలను బయటకు చెప్పరు. పేరున్న బడా బడా దర్శకులు సైతం కొన్ని సన్నివేశాల కోసం ఇతర రైటర్ల సహాయం కోరుతుంటారు. కానీ వారి బలహీనతలను బయటకు చెప్పరు. కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి అలా కాదు. టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశారాయన. ఇప్పుడు తన కెరీర్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు.

తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేశారు వంశీ పైడిపల్లి. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాను పరిస్థితులు చక్కబడిన తరువాత మొదలుపెడతారు. తాజాగా ఈ విషయాన్ని వంశీ పైడిపల్లి అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలో తన సినిమా, సినిమాకి మధ్య గ్యాప్ ఎందుకు వస్తుందనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. స్వభావ రీత్యా తను కథకుడిని కాదని.. సొంతంగా కథలు తయారు చేసుకోలేనని చెప్పారు.

కథల కోసం ఇతర రైటర్ల మీద ఆధారపడుతుంటానని.. ఆ కారణంగానే సినిమాలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసిన తరువాత కథ కోసం వెతకడం మొదలుపెడితే చాలా సమయం పట్టేస్తుందని అన్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ తరువాత చేయాలనుకుంటున్న కథను కూడా రెడీ చేసుకుంటున్నానని చెప్పారు. మాములుగా అయితే వంశీ.. బీవీఎస్ రవి, వక్కంతం వంశీ, అహిసోర్ సాల్మన్ వంటి రైటర్లు అందించిన కథ, కథనాలపై ఆధారపడుతుంటారు. టేకింగ్, మేకింగ్, స్క్రీన్ ప్లే వంటి విషయాలు ఆయన చూసుకుంటారు .