సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి రూపొందించిన సూపర్ హిట్ మూవీ ‘మహర్షి’ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. దీని తర్వాత మహేష్‌తోనే వంశీ మరో సినిమా చేయాల్సి ఉండగా.. అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత చాలామంది తెలుగు స్టార్లను ట్రై చేసి విఫలమయ్యాడు వంశీ. ‘మహర్షి’ లాంటి భారీ చిత్రం తీసి, విజయం కూడా అందుకున్నాక వంశీ పరిస్థితి ఇలా అయ్యిందేంటి అనుకున్నారంతా.
ఐతే కొంచెం గ్యాప్ వస్తే వచ్చింది కానీ.. తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో వంశీ సినిమా ఖరారు చేసుకుని వారెవా అనిపించాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే లేదు. ఐతే ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు అధికారికంగా ఖరారైంది. వంశీనే స్వయంగా తాను విజయ్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. విజయ్‌తో తాను సినిమా చేయబోతున్న మాట వాస్తవమే అని, తన కెరీర్లోనే ఇది అతి పెద్ద ప్రాజెక్టని చెప్పాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సరైన సమయం కాదని ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించలేదని వంశీ తెలిపాడు. కొవిడ్ తగ్గాక ఈ సినిమా మొదలవుతుందన్నాడు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వంశీ ధ్రువీకరించాడు.
ఇక సినిమాకు, సినిమాకు మధ్య ఎక్కువ విరామం రావడం గురించి వంశీ స్పందిస్తూ.. ‘‘నేను ఎప్పుడూ ఒకేసారి రెండు సినిమాల మీద పని చేయలేదు. ఎందుకంటే ఒక దర్శకుడి కెరీర్.. అతడి చివరి సినిమా ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది. మరోవైపు స్వభావ రీత్యా నేను కథకుడిని కాదు. అందువల్ల కథల కోసం రచయితల మీదే ఆధారపడాలి. ఒక ప్రాజెక్టు పూర్తయ్యాక కథ కోసం వెదకడంతోనే కాలం గడిచిపోతోంది. అందుకే విజయ్‌తో చేయబోయే సినిమా తర్వాత చేయాల్సిన ప్రాజెక్టు కోసం కూడా ఇప్పట్నుంచే కథ రెడీ చేసుకుంటున్నా’’ అని చెప్పాడు.