‘మెగా’ హీరోలపై సి.కళ్యాణ్ అసంతృప్తి

తెలుగు సినీ పరిశ్రమలో దీర్ఘ కాలంగా ఉన్న పెద్ద నిర్మాతల్లో సి.కళ్యాణ్ ఒకరు. కాకపోతే ఆయనదంతా ఓల్డ్ స్కూల్ వ్యవహారం. ఔట్ డేట్ అయిపోయిన సీనియర్ డైరెక్టర్లను నమ్ముకుని ఎదురు దెబ్బలు తింటుంటాడు. అందుకే ఆయన కెరీర్లో హిట్ల కంటే ఫ్లాపులు, డిజాస్టర్లే ఎక్కువ. చివరగా నందమూరి బాలకృష్ణతో చేసిన ‘రూలర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.

అంతకుముందు బాలయ్యతోనే తీసిన ‘జై సింహా’ పర్వాలేదనిపించింది. ఇక మెగా ఫ్యామిలీ యువ కథానాయకులు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లతో తీసిన ‘లోఫర్’; ‘ఇంటిలెజెంట్’ కూడా డిజాస్టర్లవడం తెలిసిందే. ఈ రెండు చిత్రాల విషయంలో కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

‘‘నేను మెగా హీరోల్లో వరుణ్ తేజ్‌తో సినిమా చేశా. నాగబాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో అనుబంధం ఉ:ది. వరుణ్‌ను నా కొడుకు అనుకుని సినిమా చేశా. ‘లోఫర్’ సినిమాకు అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టా. కానీ ఆ సినిమాకు ఏడు కోట్ల నష్టం వచ్చింది. ఆ సినిమాకు ముందు వరుణ్ తీసుకున్న పారితోషకం కంటే నేను ఎక్కువ ఇచ్చా. సినిమా ఆడకపోవడంతో ఇంకో సినిమా చేయడానికి వాళ్ల నుంచి స్పందన వస్తుందని చూస్తున్నా. తర్వాత రెండు మూడు సార్లు అనుకున్నాం కానీ.. కాంబినేషన్ కుదర్లేదు. నాకు నష్టం వచ్చింది కదా అని నాతో ఇంకో సినిమా చేయాలని వాళ్ల దగ్గరికి వెళ్లింది లేదు.

సాయిధరమ్ తేజ్‌తో ‘ఇంటిలిజెంట్’ సినిమా తీశాం. టైం బాగా లేదు. ఫ్లాప్ అయింది. ఈ సినిమా సబ్జెక్ట్ గురించి మొదట్నుంచి చెబుతూనే ఉన్నా. అనుకున్నట్లే అది తేడా కొట్టింది. ఆ సినిమా రిలీజపుడు తేజ్ ఓవర్సీస్ రిలీజ్ చేయొద్దని ఆపాడు. తేజ్‌కు బయట ఇస్తున్న దాని కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ చెప్పినా సరే.. వినాయక్‌తో మాట్లాడి సెట్ చేశాం. సినిమా రిలీజయ్యాక హీరోకు కొంచెం బ్యాలెన్స్ ఉంటే సర్దేశా. కానీ నా కెరీర్లోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఆ సినిమాకు డబ్బులు పోయాయి. అయినా వినాయక్ అంటే కోపం లేదు. సినిమా పోయినందుకు అతను చాలా బాధ పడ్డాడు. ఏడాది వరకు మనిషి కాలేకపోయాడు’’ అని కళ్యాణ్ తెలిపాడు.