కుర్ర కమెడియన్ కుమ్మేశాడు

తెలుగు ప్రేక్షకులకు దశాబ్దాల నుంచి అలవాటైన సంప్రదాయ తెలుగు యాసలతో కామెడీ చేస్తే ఇప్పుడు నవ్వులు పండట్లేదు. ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో పెద్దగా ఎవరూ ఎక్స్‌పోజ్ చేయని యాసను తీసుకొస్తే ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి యాసకు మంచి కామెడీ టైమింగ్ కూడా తోడైతే ఫన్ గ్యారెంటీ.

సప్తగిరి నెల్లూరు, చిత్తూరు జిల్లాల యాసలో కామెడీ చేస్తే చాలా కొత్తగా అనిపించి ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఇక రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి వాళ్లు అర్బన్ తెలంగాణ యాసతో మెప్పించారు. ఈ కోవలో భలేగా నవ్విస్తున్న యువ కమెడియన్ సుదర్శన్. పైన చెప్పుకున్న కమెడియన్లతో పోలిస్తే ఇతనంత పాపులర్ కాదు. చేసిన సినిమాలు మరీ ఎక్కువేమీ కాదు. పేరు ఇంకా నోటెడ్ అవ్వలేదు. ఐతే తనకు చిన్న పాత్ర ఇచ్చినా.. నెల్లూరు యాసలో డైలాగులు చెబుతూ, నేచురల్‌గా యాక్ట్ చేస్తూ భలేగా నవ్విస్తాడు సుదర్శన్.

ఈ యంగ్ కమెడియన్‌కు ఇప్పుడు కెరీర్లోనే బెస్ట్ అనదగ్గ రోల్ పడింది. అతను తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘ఏక్ మిని కథ’లో కీలక పాత్ర చేశాడు. హీరో తర్వాత అంత స్క్రీన్ టైం ఉన్న క్యారెక్టర్ ఇది. తొలి సన్నివేశంతో మొదలుపెడితే.. చివరి వరకు సుదర్శన్.. బ్రో బ్రో అంటూ అతను భలేగా కామెడీ పండించాడు. తాను కనిపించే ప్రతి సన్నివేశంలోనూ ఫన్ తగ్గకుండా చూసుకున్నాడతను. కొంచెం బోల్డ్‌గా ఉండే కాన్సెప్ట్‌ కావడంతో సుదర్శన్ డైలాగుల విషయంలో నియంత్రణ ఏమీ పాటించాల్సిన అవసరం లేకపోయింది. బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాల్లో అతను చెలరేగిపోయాడు.

ముఖ్యంగా హీరో, సుదర్శన్ కలిసి వేశ్యల దగ్గరికి వెళ్లే ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఆ సీన్లో పోలీస్ ఎటాక్ జరగ్గానే ప్లంబర్ అవతారం ఎత్తి.. ఆ తర్వాత అడ్డంగా దొరికిపోయే సీన్లో సుదర్శన్ చితగ్గొట్టేశాడు. ఈ సీన్ చూస్తే కడుపు చెక్కలు కావాల్సిందే. ఇంకా చాలా సీన్లలో సుదర్శన్ హైలైట్ అయ్యాడు. ‘ఏక్ మిని కథ’ కచ్చితంగా సుదర్శన్‌ కెరీర్‌కు మలుపు అయ్యేలాగే ఉంది.