దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు కార్యకలాపాలు ఆపేసి సైలెంటుగా ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరో సినిమా ప్రేక్షకులను పలకరించడం విశేషమే. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించిన రాధె గత వారం రంజాన్ కానుకగా జీ ఓటీటీలు, రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్లలో మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్ల ద్వారానే విడుదల చేశారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, అంతిమంగా ఈ సినిమా ఫలితమేంటి అన్నది ఆసక్తికరం.
సినిమాకు వచ్చిన టాక్ పరంగా చూస్తే రాధె డిజాస్టర్ అన్నట్లే. సల్మాన్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా ఇది విమర్శలు ఎదుర్కొంది. ఐతే వసూళ్ల పరంగా చూస్తే మాత్రం రాధె బ్లాక్ బస్టర్ అయినట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాను జీ ఓటీటీల్లో తొలి రోజే 42 లక్షల మంది చూశారు. వీకెండ్ అంతా ఓ మోస్తరుగానే వ్యూస్ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన వారి సంఖ్య కోటి మార్కును దాటిందట. 10 మిలియన్ వ్యూయర్స్ ఫర్ రాధె అంటూ సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేశారు.
సబ్‌స్క్రిప్షన్ ఫీజు కాకుండా రాధె సినిమా కోసం రూ.249 టికెట్ రేటు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం కోటి మంది సినిమా చూశారంటే రూ.249 కోట్లు జీ వారి ఖాతాలో పడ్డట్లే. ఇక కొత్త సబ్‌స్క్రిప్షన్ల వచ్చిన డబ్బులు అదనం. ఇంకా డీటీహెచ్‌ల ద్వారానూ ఈ సినిమాను కొన్ని లక్షల మంది చూసి ఉంటారు. ఇంటర్నేషనల్ మార్కెట్లలో థియేటర్ల ద్వారా వచ్చిన డబ్బులు కూడా కలుపుకుంటే రూ.300 కోట్లకు తక్కువ కాకుండా రాధె వసూళ్లు రాబట్టినట్లే అనుకోవాలి. ఆ లెక్కన చూస్తే రాధె బ్లాక్ బస్టర్ అయినట్లే. కాబట్టి ఈ మోడల్లో భారీ చిత్రాలను రిలీజ్ చేయడం లాభదాయకమే అన్నమాట. మున్ముందు మరిన్ని భారీ బాలీవుడ్ చిత్రాలు ఈ బాట పట్టినా ఆశ్చర్యం లేదేమో.