అనసూయ నక్క తోక తొక్కింది


బుల్లితెరపై యాంకర్‌గా కనిపించే అమ్మాయి సినిమాల్లో అవకాశాలు వస్తాయని.. మంచి మంచి పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తాయని.. తను బిజీ యాక్ట్రెస్ అయిపోతుందని ఎవరైనా ఊహించారా? అనసూయ భరద్వాజ్ విషయంలో ఇదే జరిగింది. యాంకర్ అంటే ట్రెడిషనల్‌ లుక్స్‌లోనే ఉండాలన్న పాత పద్ధతుల్ని మార్చేసి.. అంతకుముందు ఏ యాంకర్ చేయని స్థాయిలో గ్లామర్ విందు చేసి ట్రెండ్ క్రియేట్ చేసిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లోనూ మంచి అవకాశాలు అందుకుని కెరీర్‌ను భలేగా బిల్డ్ చేసుకుంది.

క్షణం, రంగస్థలం లాంటి చిత్రాల్లో అనసూయ పాత్రలు, నటన ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు ఆమె ‘పుష్ప’ లాంటి భారీ చిత్రంలో ఓ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’తో అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పిన సుకుమార్ మరోసారి అనసూయ కోసం ఈ సినిమాలో ఓ పాత్రను క్రియేట్ చేశాడు.

ఐతే ‘రంగస్థలం’లో మాదిరి ‘పుష్ప’లో అనసూయ చేస్తున్నది అంత కీలకమైన పాత్రేమీ కాదని సమాచారం. ఇందులో సునీల్ భార్యగా ఆమెకు మూణ్నాలుగు సీన్లు మాత్రమే కేటాయించారట. అవి తక్కువ నిడివితో ఉండేవని.. సినిమా మొత్తంలో ఐదారు నిమిషాలకు మించి ఆమె కనిపించదని సమాచారం. ఐతే ఇది కొన్ని రోజుల ముందు వరకు ఉన్న అప్‌డేట్. కానీ ఇప్పుడు వ్యవహారం మారిపోయింది. ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కథను మరింత విస్తరిస్తున్నారు. పాత్రలను పెంచుతున్నారు. అలా పెంచాలనుకున్న పాత్రల్లో అనసూయది కూడా ఒకటని సమాచారం.

ఆమె కోసం కొత్త సన్నివేశాలు రాస్తున్నారని… కథలో ఈ పాత్రకు మరింత కీలకం చేస్తున్నారని తాజా సమాచారం. ఈ క్రమంలోనే సునీల్ పాత్ర సైతం పెరుగుతోందట. క్యామియో లాంటి రోల్ అయినప్పటికీ.. సుకుమార్ మీద గౌరవంతో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్న అనసూయకు ఇప్పుడు అనుకోని అదృష్టం వరించి సినిమాలో కీలకం కాబోతుండటం విశేషమే.