ఎంత జాగ్రత్త పడ్డా.. ఇళ్లకే పరిమితం అవుతున్నా కరోనా మహమ్మారి వదలట్లేదు. ఏదో ఒక చిన్న నిర్లక్ష్యం వైరస్ బాధితులుగా మార్చేస్తోంది. గడప దాటకుండా ఇళ్లకు పరిమితం అవతున్న సినీ ప్రముఖులు సైతం వైరస్ బారిన పడుతుండటం.. కొందరి పరిస్థితి విషమిస్తుండటం.. కొందరు ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలో ఇటీవలే కరోనా కారణంగా నితీష్ వీరా అనే నటుడు.. అరుణ్ రాజా అనే దర్శకుడి భార్య ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.
ఇప్పుడు తమిళ దిగ్గజ నటుల్లో ఒకడు, రాజకీయ నాయకుడు కూడా అయిన విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా కూడా మారినట్లు చెబుతున్నారు. బుధవారం తెల్తవారుజామున అత్యవసరంగా విజయ్ కాంత్ ఆసుపత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను ఆందోళనలోకి నెట్టింది.
విజయ్ కాంత్ కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడగా.. ఆయనకు తాజాగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటలకు అత్యవసరంగా విజయ్ కాంత్ ఆసుపత్రికి వెళ్లాడనగానే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారి ఉంటుందనే భయం అభిమానుల్లో కలిగింది. ఉదయం నుంచి విజయ్ కాంత్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు అభిమానులు.
ఐతే విజయ్ కాంత్‌కు కరోనా అని అధికారికంగా అయితే ఎలాంటి సమాచారం లేదు. అభిమానులు ఆందోళన చెందకుండా విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆయన హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లారని.. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. అభిమానులు కంగారు పడాల్సిన పని లేదని అందులో పేర్కొన్నారు. కానీ విజయ్ కాంత్ వాస్తవ పరిస్థితి ఏంటనే ఆందోళన మాత్రం అభిమానుల్లో కొనసాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates