మొత్తానికి పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుండటం ఖరారైనట్లే. నిర్మాతలే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం కథను రెండు భాగాలు చేయడంపై కసరత్తు జరుగుతోంది. తొలి భాగాన్ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలు చేయడానికి ఒక కారణం.. సినిమా బడ్జెట్ పెరిగిపోవడం, చిత్రీకరణ ఆలస్యమవుతుండటం. కథను రెండు భాగాలుగా విస్తరించి.. తొలి భాగాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసే దిశగా ప్రస్తుతం సుక్కు అండ్ టీం కష్టపడుతోంది.
సినిమాను టూ పార్ట్స్ చేయడంతో ఇప్పుడు బడ్జెట్ పరంగా సమస్యలు తీరిపోయినట్లే. ఒక సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ దాదాపు రూ.120 కోట్లు కాగా.. అది తర్వాత రూ.150 కోట్లకు పెరిగేలా కనిపించింది. కాగా ఇప్పుడు రెండు భాగాల బడ్జెట్‌ను మొత్తంగా రూ.250 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.
బడ్జెట్ పెంపు గురించి నిర్మాతలు పెద్దగా ఆందోళన చెందట్లేదు. రెండు భాగాలకు కలిపి బిజినెస్ రూ.500 కోట్లు చేసుకోవచ్చన్న అంచనాతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ రూ.250 కోట్లు అన్న మాటే కానీ.. అందులో సగం దాకా హీరో, దర్శకుల జేబుల్లోకే వెళ్లిపోతుంది. మిగతా పారితోషకాలు కాకుండా సినిమా మేకింగ్‌కు ఖర్చు పెట్టేది అటు ఇటుగా రూ.100 కోట్లు ఉండొచ్చేమో.
అలవైకుంఠపురములో తర్వాత బన్నీ, రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు మామూలుగా లేవు. ట్రేడ్ వర్గాల్లో మంచి డిమాండే ఉంది. ఇప్పటికే మంచి బిజినెస్ ఆఫర్లున్నాయి. రెండు భాగాలకు కలిపి రూ.500 కోట్ల బిజినెస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నారు. అందులోనూ తొలి భాగం రిలీజై మంచి ఫలితాన్నందుకుంటే రూ.500 కోట్ల టార్గెట్‌ను కూడా దాటిపోయి ఇంకా ఎక్కువ బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు.