గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభణతో లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి అసమాన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా ప్రశంసలందుకుంటూ వస్తున్నాడు సోనూ. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ అతను అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అతడి ఉద్దేశాల మీద కొందరికి అభ్యంతరాలున్నాయి. తన సేవ గురించి అతిగా ప్రచారం చేసుకుంటున్నాడని.. కొన్ని ఫేక్ ప్రచారాలు కూడా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వాలు విఫలమవుతున్న చోట సోనూ ఆపద్బాంధవుడిలా మారి సాయం అందిస్తుండటంతో అధికార పార్టీల మద్దతుదారులు అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ మధ్య పనిగట్టుకుని సోనూను తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే సోనూ చేసిన ఒక ట్వీట్ గురించి చిన్న రాద్దాంతం జరిగింది.
ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఒక వ్యక్తికి ఆక్సిజన్ బెడ్ అవసరమని సోనూ టీంకు రిక్వెస్ట్ వచ్చింది. కాసేపటికే సదరు వ్యక్తికి బెడ్ అరేంజ్ చేసినట్లుగా సోనూ ఒక ట్వీట్ పెట్టాడు. ఐతే కాసేపటి తర్వాత దీనిపై గంజాం జిల్లా కలెక్టర్ స్పందించారు. బాధితుడికి తామే బెడ్ అరేంజ్ చేశామని.. సోనూ టీం నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొంటూ కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి మెసేజ్ పోస్ట్ అయింది. దీంతో అందరూ సోనూను అనుమానించడం మొదలుపెట్టారు. కానీ తర్వాత సోనూ అసలు విషయం చెప్పాడు. బాధితుడు తమను ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్ కోసం వాట్సాప్ ద్వారా సంప్రదించడం.. తాము అరేంజ్ చేయడం.. అతను కృతజ్ఞతలు చెప్పడం.. ఈ మొత్తం మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోనూ షేర్ చేశాడు.
తాము ప్రభుత్వ వర్గాలను సంప్రదించినట్లు ఎక్కడా క్లెయిమ్ చేసుకోలేదని.. ఏదో ఒక మార్గంలో బాధితుడికి బెడ్ అందేలా మాత్రం చూశామని.. కావాలంటే ఆ వ్యక్తితో తమ సంభాషణను పరిశీలించుకోవచ్చని అన్నాడు. అలాగని ప్రభుత్వ వర్గాలను తక్కువ చేయకుండా వారు చేస్తున్న మంచి పనులను సోనూ ప్రశంసించడం గమనార్హం.