వ‌ర్మ ఆ విష‌యం దాచిపెట్టేసి..


ప్రేక్ష‌కుల‌కు ఒక‌ప్పుడు త‌న సినిమాల మాయాజాలంతో క‌ట్టిప‌డేసేవాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న మైకంలో ప‌డి వెర్రిగా త‌న సినిమాలు చూసిన ప్రేక్ష‌కులు కోట్ల‌ల్లోనే ఉన్నారు. కానీ త‌ర్వాతి కాలంలో త‌న‌పై ప్రేక్ష‌కులు పెట్టుకున్న అంచ‌నాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయాడు వ‌ర్మ‌. గ‌త కొన్నేళ్ల‌లో అయితే ఆయ‌న స్టాండ‌ర్డ్స్ మ‌రీ ప‌డిపోయాయి. పూర్తిగా నాసిర‌కం సినిమాల‌తో త‌న అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేశాడు వ‌ర్మ‌. కొన్నేళ్ల పాటు ప‌బ్లిసిటీ గిమ్మిక్కుల‌తో త‌న సినిమాల‌ను కొంత‌మేర సేల్ చేసుకోగ‌లిగిన వ‌ర్మ‌.. ఇప్పుడు ఆ ప‌నీ చేయ‌లేక‌పోతున్నాడు. ఈ మ‌ధ్య వ‌ర్మ సినిమాల‌కు క‌నీస స్పంద‌న కూడా క‌ర‌వ‌వుతోంది.

ఐతే ఇలాంటి టైంలో త‌న‌కు బాగా ప‌ట్టుకున్న మాఫియా జాన‌ర్లో, అది కూడా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం జీవిత క‌థ ఆధారంగా డి కంపెనీ అనే సినిమా తీసేస‌రికి వ‌ర్మ మీద ప్రేక్ష‌కుల్లో కొంచెం ఆశ‌లు రేకెత్తాయి. స్పార్క్ అనే కొత్త ఓటీటీ ద్వారా శుక్ర‌వారం రాత్రి డి కంపెనీ విడుద‌లైంది. గ‌త కొన్నేళ్ల‌లో వ‌ర్మ నుంచి వ‌చ్చిన పేల‌వ చిత్రాల‌తో పోలిస్తే న‌యం అన్న మాటే కానీ.. అంత‌కుమించి డి కంపెనీ నుంచి ఆశించ‌డానికి పెద్ద‌గా ఏమీ లేక‌పోయింది. వ‌ర్మ‌తో పాటు చాలామంది తీసిన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాల‌కు భిన్నంగా ఇందులో ఏమీ లేదు. రెండు గ్యాంగుల మ‌ధ్య పోరు నేప‌థ్యంలో ప్రేక్ష‌కులు ఏమాత్రం క‌నెక్ట్ కాని క‌థ‌ను చూపించాడు వ‌ర్మ‌. దావూద్ ఇబ్ర‌హీం జీవిత క‌థ అంటే.. జ‌నాల‌కు క‌నెక్ట్ అయ్యే చాలా అంశాలుంటాయ‌ని.. అత‌ను ముంబ‌యిలో చేసిన అరాచ‌కాలు, ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి చేసిన దాడులు లాంటివ‌న్నీ చూడ‌బోతున్నామ‌ని ఆశించారు ప్రేక్ష‌కులు.

కానీ వ‌ర్మ తాజాగా రిలీజ్ చేసిన సినిమాలో అవేవీ లేవు. దావూద్ డాన్‌గా ఒక స్థాయి అందుకోవ‌డానికి ముందు జ‌రిగిన ఉదంతాలు మాత్ర‌మే ఈ సినిమాలో చూపించారు. అంత‌ర్జాతీయ స్థాయికి అత‌డి ఎదుగుద‌ల అంతా ఇంకో పార్ట్‌లో చూపిస్తాడ‌ట‌. ఈ విష‌యం వ‌ర్మ ముందు చెప్ప‌లేదు. ఒకేసారి దావూద్ క‌థంతా చూసేద్దామ‌ని ఆశించిన ప్రేక్ష‌కుల‌కు ఫ‌స్ట్ పార్ట్ షాకిచ్చింది. ఇప్ప‌టికే డ‌బ్బులు వృథా అనుకుంటుంటే.. దావూద్ మిగ‌తా క‌థ కోసం మ‌ళ్లీ డ‌బ్బులు పెట్టాలా అంటూ ఫ‌స్ట్ పార్ట్ చూసిన వాళ్లు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సినిమా రెండు భాగాల‌ని వ‌ర్మ ముందే కాస్త ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేదేమో. ఫ‌స్ట్ పార్ట్ పెట్టిన చికాకుతో ఇక రెండో పార్ట్ చూడాల‌న్న ఆస‌క్తి కూడా చ‌చ్చిపోతుందేమో.