ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్ గంటల తరబడి సమయాన్ని ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేరు. అందుకే మేకర్స్ జనాన్ని ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయితే ఒక్కోసారి కొన్ని సన్నివేశాలు అనూహ్యంగా జనాల అటెన్షన్ తీసుకుంటాయి. అలాంటిదే హాట్ స్పాట్ 2.

ఇటీవలే రిలీజైన ఈ వెబ్ సిరీస్ తమిళంలో మంచి స్పందనే తెచ్చుకుంది. తెలుగులో డబ్బింగ్ చేసి ఈ వారంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒక ఎపిసోడ్ సోషల్ మీడియాలో ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుని వీడియో రూపంలో వైరల్ అయ్యింది.

అదేంటంటే ఒక టీనేజ్ అమ్మాయి కురచ బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటుంది. తండ్రి ఇదేమని అడిగితే స్వాతంత్రం. స్త్రీ స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేసి క్లాస్ తీసుకుంటుంది. దీంతో అప్పటికి మౌనంగా ఉన్న తండ్రి అదే కూతురు పుట్టినరోజుకి చిరిగిపోయిన బనియన్, పాత కాలం గోచి లాంటి షార్ట్ వేసుకుని ఆమె స్నేహితుల మధ్యలోకి వస్తాడు.

అవమానంగా ఫీలైన అమ్మాయి ఇదేంటని నిలదీస్తుంది. చెన్నై ఎండల్లో ఇదే తనకు సౌకర్యంగా ఉంటుందని, అయినా మగాళ్ల వస్త్రధారణ గురించి చెప్పడానికి నువ్వెవరు అంటూ నాన్న కౌంటర్ ఇస్తాడు. దీంతో ఆ అమ్మాయికి కనువిప్పు కలిగి తప్పు తెలుసుకుంటుంది.

ఫ్రీడమ్ పేరుతో అమ్మాయిల విచ్చలవిడితనాన్ని ఇలా ప్రశ్నించిన తీరు నెటిజెన్లను బాగా ఆకట్టుకుంది. తండ్రిగా తంబి రామయ్య పెర్ఫార్మన్స్ అక్కడ హైలైట్ గా నిలిచింది. అలాని చెప్పి సిరీస్ మొత్తం ఇలాగే ఉంటుందని కాదు. కొంత బోల్డ్ కంటెంట్, డైలాగులు ఉన్నాయి.

మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఇప్పుడీ రెండో భాగాన్ని రిలీజ్ చేశారు. రవితేజ ఇరుముడిలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియా భవాని శంకర్ ఈ హాట్ స్పాట్ 2లో మెయిన్ లీడ్. నిర్మాతకు కథలు చెప్పే పాత్రను పోషించింది. ఇలాంటి కంటెంట్లు తెలుగు ఆడియన్స్ కూడా బాగానే ఆదరిస్తారు కాబట్టి మన దగ్గర ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.