వంశీ పైడిపల్లిది మామూలు కష్టం కాదు

తన సినిమాల్లో కంటెంట్, వాటి ఫలితాల్ని బట్టి చూస్తే వంశీ పైడిపల్లి తన స్థాయికి మించిన అవకాశాలే అందుకున్నాడన్న అభిప్రాయం టాలీవుడ్లో ఉంది. అతడి తొలి సినిమా ‘మన్నా’ ఫ్లాప్. రెండో సినిమా ‘బృందావం’ ఓ మాదిరిగా ఆడింది. ‘ఎవడు’ మంచి హిట్టే అయినా ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో కథను అల్లడంతో వంశీకి పెద్దగా క్రెడిట్ రాలేదు. ఇక అతడి కెరీర్లో బెస్ట్ మూవీ అనదగ్గ ‘ఊపిరి’ ఏమో ఫ్రెంచ్ మూవీకి అఫీషియల్ రీమేక్.

చివరగా వంశీ ఓ రేంజిలో చెప్పుకున్న ‘మహర్షి’ విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే వ్యక్తమైంది. ఐతే ఈ సినిమాతో మహేష్ బాబును ఫుల్లుగా ఇంప్రెస్ చేసేసి అతడితో ఇంకో సినిమా చేసే అవకాశం అందుకున్నాడతను. కానీ ఈ సంబరం ఎన్నో రోజులు కొనసాగలేదు. స్క్రిప్టు నచ్చక మహేష్ ఈ సినిమాను పక్కన పెట్టేయడంతో వంశీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

తనతో వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితంగా ఉన్న మహేష్ ఇలా షాకిస్తాడని వంశీ ఊహించి ఉండడు. ఈ షాక్ నుంచి కోలుకుని వేరే హీరోల నుంచి కమిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ.. వంశీకి ఎవ్వరూ అవకాశం ఇవ్వట్లేదని సమాచారం. గత కొన్ని నెలల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇలా చాలామంది స్టార్లనే వంశీ కలిశాడట. కానీ అందరూ బిజీనే. అతడి నరేషన్ వినడానికి కూడా ఎవ్వరూ మొగ్గు చూపించడం లేదని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లందరికీ వేరే కమిట్మెంట్లున్నాయి. చాలా బిజీగా ఉన్నారు.

ఐతే లాక్ డౌన్ టైంలో ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని ఖరారు చేసుకునే ప్రయత్నంలో హీరోలున్నప్పటికీ.. వంశీకి అపాయింట్మెంట్లు దొరకట్లేదట. రామ్ చరణ్ ఒక్కడి నుంచి కాస్త సానుకూల స్పందన వచ్చిందని.. తనకు ‘ఎవడు’తో హిట్టిచ్చాడన్న ఆలోచనతో చరణ్ అతడి కథ వినడానికి ఓకే చెప్పాడని.. ‘ఆర్ఆర్ఆర్’తో మరో స్థాయికి వెళ్లబోతున్న చరణ్ వంశీతో సినిమా చేయడం అసాధ్యమే అని.. అతడికి కూడా వేరే కమిట్మెంట్లున్నాయని అంటున్నారు. చేస్తే స్టార్‌తోనే చేస్తా అన్నట్లున్న వంశీకి అవకాశం అంత తేలిగ్గా దక్కేలా లేదు.