సోనూ సూద్ పేరెత్తగానే రియల్ హీరో అనే మాట అందరి మనసుల్లో మెదులుతుంది. గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి అతను చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత సేవ చేద్దామనుకున్న వాళ్లయినా.. ఒక దశ దాటాక అలసిపోతారు. విసిగిపోతారు. లేదా వనరులు అయిపోవడంతో చేతులెత్తేస్తారు. కానీ సోనూ మాత్రం ఏడాది తర్వాత కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తన దగ్గరున్న దానికి దాతల తోడ్పాటు కూడా అందుతుండటంతో అతను ప్రభుత్వాలు కూడా చేయలేని స్థాయిలో కొవిడ్ బాధితులకు, ఇతర అభాగ్యులకు సాయపడుతున్నాడు.
రోజూ దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి అతడికి వేలల్లో వినతులు అందుతున్నాయి. ఆసుపత్రి బెడ్ల కోసం.. వెంటిలేటర్ల కోసం.. ఆక్సిజన్ సిలిండర్ల కోసం.. వివిధ రకాల మందుల కోసం అతడికి రిక్వెస్ట్‌లు పంపుతున్నారు జనం. అందులో తన టీం ద్వారా వీలైనంత మందికి సాయం చేయగలుగుతున్నాడు సోనూ.
సోనూ నుంచి సాయం పొందుతున్న వాళ్లు పెడుతున్న పోస్టులు చూస్తే అతనెంత గొప్ప సాయం చేస్తున్నాడో అర్థమవుతుంది. ఐతే ఈ కల్లోల సమయంలో సోనూ సేవా దృక్పథాన్ని ఎలివేట్ చేస్తూ ఒక నెటిజన్ సరదాగా ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ఒక కార్టూన్‌ను అతను షేర్ చేశాడు. ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోవడంతో స్వదేశానికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్‌లు తమను ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేయమని సోనూకు రిక్వెస్ట్ పెడుతున్నట్లుగా ఉంది.
సోనూను ట్యాగ్ చేస్తూ ఆ నెటిజన్ ఈ కార్టూన్‌ను షేర్ చేయగా.. వెంటనే బ్యాగులు సర్దుకోండి, ఇంటికి పంపిస్తా అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు సోనూ. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయగా.. ఎంతోమంది సోనూ ద్వారా సాయం పొందారు. ఇదే విషయాన్ని సూచిస్తూ ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా సోనూ సాయం కోరుతున్నట్లున్న ఈ కార్టూన్‌కు సోనూ స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంది.