చిన్న రౌడీ.. సైలెంటుగా ఇంకోటి

‘దొరసాని’ లాంటి డిజాస్టర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అయినా అతడి కెరీర్‌కేమీ ఢోకా లేకపోయింది. అన్న అండతో మరో సినిమాలో అవకాశం సంపాదించాడు. అదే.. మిడిల్ క్లాస్ మెలోడీస్. గత ఏడాది లాక్ డౌన్ టైంలో అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.

ఆనంద్ ఖాతాలో తొలి హిట్ పడటంతో అతడికిక అవకాశాలకు లోటు లేకపోయింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తరహాలోనే సైలెంటుగా అతను ‘పుష్పక విమానం’ పేరుతో మరో సినిమా పూర్తి చేసేసిన సంగతి తెలిసిందే. అది విడుదలకు సిద్ధమవుతోంది కూడా. అది రిలీజ్ కాకుండానే ఆనంద్ హీరోగా ఇప్పుడు మరో సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాకు గురువారమే ప్రారంభోత్సవం జరిపారు.

‘దూకుడు’ స‌హా దక్షిణాదిన ఎన్నో భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించి.. తర్వాత దర్శకుడిగా మారిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ నటించనున్నాడు. తమిళంలో ఒకట్రెండు సినిమాలు తీసిన గుహన్.. తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘118’ అనే థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి ఫ‌లితం అందుకున్నాక రాజశేఖర్ తనయురాలు శివాని ప్రధాన పాత్రలో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ అనే మరో థ్రిల్లర్ మూవీని రూపొందించాడు. అది విడుదలకు సిద్ధమవుతోంది.

ఇంతలో ఇప్పుడు ఆనంద్ హీరోగా సినిమాను మొదలుపెట్టాడు గుహన్. ఈ సినిమాకు ‘హై వే’ అనే టైటిల్ ఖరారు చేశారు. గుహన్ గత సినిమాల్లాగే ఇది కూడా థ్రిల్లరేనట. వెంకట్ తలారి అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆనంద్ ఇది కాక రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్లు ఇవ్వడం విశేషం.