ప‌వ‌న్ సినిమా టైటిల్ అది కాదు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌బ్బ‌ర్ సింగ్ జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకుంటూ, త‌మ క‌ల‌యిక‌లో రాబోతున్న త‌ర్వాతి సినిమా గురించి ఇటీవ‌ల ఒక హ‌రీష్ ఒక నోట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో చివ‌ర్లో ఇప్పుడే మొద‌లైంది అని హ‌రీష్ పేర్కొన‌గా.. ప‌వ‌న్‌తో హ‌రీష్ చేయ‌బోయే కొత్త సినిమా టైటిల్ ఇదే అయ్యుండొచ్చ‌నే ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై జోరుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఐతే హ‌రీష్ శంక‌ర్ ఈ వార్త‌ల్ని ఖండించాడు. గ‌బ్బ‌ర్ సింగ్ ఇంట‌ర్వెల్‌కు ముందు సీన్లో అప్పుడే అయిపోయింద‌నుకోకు.. ఇప్పుడే మొద‌లైంది అని ప‌వ‌న్ డైలాగ్ చెబుతాడ‌ని.. ప‌వ‌న్‌తో మ‌రో సినిమాకు ప‌ని మొద‌లైన నేప‌థ్యంలోనే తాను నోట్‌లో ఇప్పుడే మొద‌లైంది అని పెట్టాన‌ని.. అంతే త‌ప్ప అది సినిమా టైటిల్ కాద‌ని హ‌రీష్ స్ప‌ష్టం చేశాడు. మరోవైపు ప‌వ‌న్ సినిమాకు క‌థ దాదాపుగా పూర్త‌యిన‌ట్లు హ‌రీష్ చెప్ప‌డం అభిమానుల‌కు ఉత్సాహాన్నిచ్చే వార్తే.

ఇక ఈ సినిమా కోసం మ‌ల‌యాళ అమ్మాయి మాన‌స రాధాకృష్ణ‌న్‌ను క‌థానాయిక‌గా ఖ‌రారు చేసిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్ని హ‌రీష్ ఖండించాడు. హీరోయిన్ విష‌యంలో ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశాడు. ఈ సినిమా గురించి ప్ర‌స్తుత ద‌శ‌లో ఇంకేం చెప్పినా తొంద‌రే అవుతుంద‌ని.. సినిమా మొద‌ల‌య్యే వ‌ర‌కు ఆగాల‌ని కోరాడు హ‌రీష్‌. ఈ చిత్రాన్ని ప‌వ‌న్‌తో కొన్నేళ్ల కింద‌టే క‌మిట్మెంట్ తీసుకున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్, క్రిష్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ ఈ చిత్రంలో న‌టించ‌నున్నాడు.