ఆ హీరోకు నచ్చితే అంతే మరి..

తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఒక దర్శకుడు నచ్చితే వరుసగా అతడితో సినిమాలు చేసేస్తుంటాడు. ఇంతకుముందు ‘శౌర్య’ శివతో ఇలాగే నాలుగు సినిమాలు చేసేశాడు. ‘వీరం’తో వీళ్లిద్దరూ తొలిసారి జోడీ కట్టారు. అది సూపర్ హిట్టయింది. వీరి కలయికలో వచ్చిన రెండో సినిమా ‘వేదాళం’ సైతం సూపర్ హిట్టే. దీంతో మళ్లీ ఈ జంట కలిసి ‘వివేగం’ చేసింది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా.. అజిత్ తగ్గలేదు. శివతో మళ్లీ ‘విశ్వాసం’ చేశాడు. అది బ్లాక్‌బస్టర్ అయింది.

అక్కడ కట్ చేస్తే.. శివ నుంచి బ్రేక్ తీసుకున్నాక అజిత్ హెచ్.వినోద్ అనే యువ దర్శకుడితో జట్టు కట్టాడు. శతురంగ వేట్టై, ఖాకి చిత్రాలతో వినోద్ మంచి పేరే సంపాదించాడు. అతడితో ‘పింక్’ రీమేక్ ‘నీర్కెండ పార్వై’ చేశాడు అజిత్. ఆ సినిమా బాగా ఆడింది. దీంతో వెంటనే వినోద్ సొంత కథతో ఓ సినిమా మొదలుపెట్టాడు. అదే.. వాలిమై. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందిప్పుడు.

ఈ సినిమా ఈ ఏడాదే ఏదో ఒక సమయంలో విడుదలవుతుందని ఆశిస్తున్నారు. ఐతే ఈలోపే వినోద్‌తో మరో సినిమా లైన్లో పెట్టేశాడట అజిత్. వీరి కలయికలో హ్యాట్రిక్ మూవీ వచ్చే ఏఢాది మొదలవుతుందట. నీర్కొండ పార్వై, వాలిమై చిత్రాల నిర్మాత బోనీ కపూరే మళ్లీ ఈ ఇద్దరితో కలిసి సినిమా చేయబోతున్నాడట.

ఐతే ఈ సినిమా మొదలు కావడానికి ముందు అజిత్ మధ్యలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించబోయేది తెలుగమ్మాయి అయిన సుధ కొంగర కావడం విశేషం. సూర్యతో ఆమె తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ మంచి ఫలితాన్నందుకోవడంతో తనతో సినిమా చేయడానికి అజిత్ ముందుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. అజిత్‌తో ఈ సినిమా పూర్తి చేశాక మహేష్ బాబుతో ఓ చిత్రం చేయడానికి సుధ ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.