టాలీవుడ్లో మరో సెలబ్రెటీ కరోనా బారిన పడ్డారు. తాను కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించాడు. ఐతే తనకు కరోనా లక్షణాలు మరీ ఎక్కువేమీ లేవని, తాను క్షేమంగానే ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని బన్నీ కోరాడు. అల్లు కథానాయకుడికి కరోనా అని తెలియగానే సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి. #Getwellsoonalluarjun అని హ్యాష్ ట్యాగ్ పెట్టి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సెలబ్రెటీల్లోనూ చాలామంది బన్నీ త్వరగా కోలుకోవాలంటూ మెసేజ్‌లు పెట్టారు.
ఐతే బన్నీ చివరి సినిమా ‘అల వైకుంఠపురములో’ కోస్టార్ పూజా హెగ్డే మాత్రం ఈ న్యూస్ పట్ల కొంచెం సరదాగా స్పందించింది. పూజా ఇప్పటికే కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు పొడి దగ్గు ఉన్నట్లు, అలాగే వాసన కోల్పోియినట్లు కూడా వెల్లడైంది. అయినప్పటికీ పూజా ఏమీ స్థైర్యం కోల్పోలేదు. అలాగే తన సెన్సాఫ్ హ్యూమర్‌నూ విడిచిపెట్టలేదు.
అమూల్య (అల వైకుంఠపురుములో పూజా క్యారెక్టర్ పేరు)కు కంపెనీ ఇవ్వడానికి బంటూ (అల..లో బన్నీ పేరు) వచ్చాడని ఆమె ట్వీట్ వేసింది. సరదాకు ఆ మాట అంటూనే బన్నీ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించింది. స్వయంగా పూజా సైతం కరోనా పేషెంటే కావడంతో ఈ టైంలో ఈ జోకులేంటి అని ఆమెను అల్లు అర్జున్ అభిమానులేమీ టార్గెట్ చేయట్లేదు. బన్నీని పూజా స్పెషల్ కోస్టార్‌గా చూస్తుంది. అతడితో చేసిన తొలి చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’తోనే ఆమె దశ తిరిగింది.
ఆ సినిమా సరిగా ఆడకున్నా పూజా మాత్రం అందరినీ ఇంప్రెస్ చేసి అవకాశాలు అందుకుంది. పెద్ద స్టార్ అయిపోయింది. బన్నీతో రెండోసారి కలిసి చేసిన ‘అల వైకుంఠపురములో’ ఏకంగా టాలీవుడ్లో నాన్ బాహుబలి హిట్ కావడంతో పూజా రేంజ్ ఇంకా పెరిగిపోయింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఆమె భారీ చిత్రాల్లో నటిస్తోంది. పూజాతో పాటు అల్లు అర్జున్ కూడా త్వరగా కోలుకుని మామూలు మనుషులు కావాలని ఆశిద్దాం.