స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ - పది సూత్రాలు

మళ్లీ ఓటీటీల రాజ్యం?

కొవిడ్ కష్టాలన్నీ దాటేశామని.. గత ఏడాది చూసిన గడ్డు పరిస్థితులు ఇంకెప్పటికీ రావని నెల కిందటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు సినీ జనాలు. కానీ చూస్తుండగానే పరిస్థితులు మారిపోయాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్లు మూతపడిపోయాయి. గత ఏడాది ఇదే పరిస్థితి నెలకొనగా.. కొన్ని రోజుల్లోనే మామూలు స్థితికి వచ్చేస్తామని.. షూటింగ్స్ పున:ప్రారంభం అవుతాయని.. థియేటర్లు మళ్లీ తెరుచుకుంటాయని అనుకున్నారు. కానీ అందుకోసం నెలలకు నెలలు ఎదురు చూసి చూసి అలసిపోయారు.

ఒక దశ దాటాక థియేటర్ల మీద పూర్తిగా ఆశలు కోల్పోయి కొత్త సినిమాలను ఓటీటీ బాట పట్టించారు. కష్ట కాలంలో ఓటీటీలే ఇండస్ట్రీని ఆదుకున్నాయి. ఇళ్లకు పరిమితం అయిన జనాలు ఓటీటీలను ఆదరించడంతో.. అవి మంచి రేట్లు పెట్టి కొత్త సినిమాలను కొని నేరుగా రిలీజ్ చేశాయి. దీంతో కొంత మేర ఇండస్ట్రీ కష్టాల నుంచి గట్టెక్కింది. మళ్లీ థియేటర్లు మొదలయ్యాక నెమ్మదిగా ఓటీటీల జోరు తగ్గుతూ వచ్చింది. తెలుగులో అయితే నేరుగా ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేయడం దాదాపు ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ ఆగి, థియేటర్లు మూతపడ్డ పరిస్థితుల్లో ఓటీటీల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ నెలలో రావాల్సిన క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడిపోయాయి. థియేటర్ల మీద ఆంక్షలు మొదలయ్యాయి.

ఏపీలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించారు. అక్కడ టికెట్ల రేట్ల మీద నియంత్రణా కొనసాగుతుండటంతో థియేటర్లను ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పెట్టి 8 గంటలకే థియేటర్లు మూసివేయాలని చెప్పడంతో అలా ఎందుకని మొత్తంగా థియేటర్లనే మూసేస్తున్నారు. కరోనా మళ్లీ ఎప్పటికి నియంత్రణలోకి వస్తుందో.. థియేటర్లు ఒకప్పటిలా నడిచేదెప్పుడో తెలియని అయోమయం నెలకొంది. కొన్ని రోజులు ఎదురు చూశాక పరిస్థితులు మారకపోతే మళ్లీ నిర్మాతలు కొత్త చిత్రాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి పూనుకోవడం ఖాయం. ఓటీటీలు కూడా ఆ దిశగా సానుకూలంగానే స్పందించే అవకాశముంది.