వేసవి వినోదం.. ఏదో అనుకుంటే ఇంకేదో


గత ఏడాది వేసవిలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సినీ ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకునే వేసవి సీజన్.. నిరుడు కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో వెలవెలబోయింది. అసలు బయటికి వెళ్లి సినిమాలు చూసే అవకాశమే లేక మూవీ గోయర్స్‌కు పిచ్చెక్కి పోయింది. ఏడెనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ థియేటర్లు తెరుచుకుని సినిమాలు నడవడం మొదలయ్యాక వాళ్లందరిలో ఉత్సాహం వచ్చింది. గత కొన్ని నెలల్లో తెలుగు సినిమా బాగా పుంజుకుని పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.

ఇక వేసవిలో సినిమాల మోతే అని.. పతాక స్థాయి వినోదం చూడబోతున్నామని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ప్రేక్షకులు. అందులోనూ ‘వకీల్ సాబ్’తో సమ్మర్ సీజన్‌కు అదిరే ఆరంభం రావడంతో ఇక రాబోయే వారాల్లో సందడి మామూలుగా ఉండదని అనుకున్నారు. భారీ ఆశలు, అంచనాలతో వేసవి వినోదానికి సిద్ధమయ్యారు సినీ ప్రియులు.

కానీ కొన్ని రోజుల వ్యవధిలో మొత్తం మారిపోయింది. రేసులో ఉన్న ఆసక్తికర చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా థియేటర్లు వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. ‘వకీల్ సాబ్’ సందడి ఇంకెన్నో రోజులు కొనసాగేలా లేదు. కొత్త సినిమాలు చూస్తే పెద్దగా ఆశలు రేకెత్తించడం లేదు. గత ఏడాది ఈ సమయానికి థియేటర్లు పూర్తిగా మూత పడ్డాయి. ఇప్పుడు తెరిచి ఉండబోతున్నాయి. అంతే తేడా.

‘లవ్ స్టోరి’ లాంటి క్రేజీ మూవీ సందడి చేయాల్సిన ఈ వీకెండ్లో ఆర్జీవీ దెయ్యం, 99 సాంగ్స్ లాంటి సినిమాలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి. వీటి వంక ఎవ్వరూ చూడట్లేదు. వచ్చే వారం నాని సినిమా ‘టక్ జగదీష్’ రావాల్సింది. కానీ ఆ స్థానంలోకి ‘ఇష్క్’ అనే చిన్న సినిమా వచ్చింది. దాని మీదా ఆసక్తి అంతంతమాత్రమే. ఇక ‘విరాట పర్వం’ లాంటి పేరున్న సినిమా సందడి చేయాల్సిన వీకెండ్లో ‘ఏక్ మిని కథ’ అనే చిన్న చిత్రం రిలీజ్ కానుంది. వేసవి మీద భారీ అంచనాలతో ఉంటే.. ఇలాంటి చిత్రాలతో సర్దుకుపోవాల్సి రావడం అనూహ్యం. వేసవిలో ప్రేక్షకులు కోరుకునే సినిమాలు కావివి. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో వీటిలో సర్దుకుపోవాలి. లేదంటే సినిమాలకు టాటా చెప్పేసి ఇంట్లో కూర్చోవాలి.