త్రివిక్రమ్ చేసినట్లు కొరటాల చేయలేదే..


కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. మాటల మాంత్రికుడి స్థానంలోకి మరో అగ్ర దర్శకుడు కొరటాల శివ వచ్చాడు. ఆయన మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇందులో భాగస్వామే. ఐతే కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకే ప్రస్తుతానికి ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో తారక్ మళ్లీ జట్టు కట్టడం అయితే ఖాయమే అని స్పష్టంగా తెలుస్తోంది. కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌లతో సినిమాలు అయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిన బేనర్లోనే తారక్ తన 32వ సినిమాను చేసే అవకాశాలున్నాయి.

హారిక హాసిని సంస్థలో కీలక వ్యక్తి అయిన సూర్యదేవర నాగవంశీ ఈ దిశగా సంకేతాలు ఇచ్చాడు కూడా. ఎన్టీఆర్ 30వ సినిమాను తాము చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నామని.. కానీ తారక్‌తో ఇదే కాంబినేషన్లో సినిమా సాధ్యమైనంత త్వరలోనే ఉంటుందని స్పష్టం చేశాడు. దీన్ని బట్టి త్రివిక్రమ్‌కు, తారక్‌కు మధ్య కథ విషయంలో భేదాభిప్రాయాలు తప్ప, వ్యక్తిగతంగా ఇద్దరి సంబంధాలేమీ దెబ్బ తినలేదని స్పష్టమవుతోంది. తారక్ ఫ్యాన్స్ హర్టవకుండా నాగవంశీ ఈ మేరకు స్పష్టత ఇచ్చి మంచి పని చేశాడు. ఐతే ఇలాంటి స్పష్టత కొరటాల నుంచి.. అల్లు అర్జున్ అభిమానులకు రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

‘పుష్ప’ తర్వాత కొరటాల దర్శకత్వంలో బన్నీ నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని 2022 వేసవిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందు సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే సమయంలో తారక్-కొరటాల సినిమాకు డేట్ ఇచ్చారు. దీన్ని బట్టి బన్నీతో కొరటాల సినిమా క్యాన్సిల్ అవడమో, వాయిదా పడటమో జరిగినట్లుంది. ఐతే ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుండా తారక్ సినిమా గురించే కొరటాల, నిర్మాత మిక్కిలినేని సుధాకర్ మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై రచ్చ నడుస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా కొరటాల.. బన్నీ సినిమా గురించి స్పష్టత ఇస్తే బెటర్.