ఆ డైలాగేంది బాలయ్యా

నందమూరి బాలకృష్ణ.. తన అభిమానులకు ఉగాది కానుక ఇచ్చేశాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బోయపాటి దర్శకత్వంలో తాను నటిస్తున్న చిత్రం టైటిల్ వెల్లడించాడు. ఈ రోజే టైటిల్ రోర్ పేరుతో చిన్న టీజర్ ఒకటి వదిలారు. బాలయ్య నెవర్ బిఫోర్ లుక్‌తో చాలా పవర్ ఫుల్‌గా కనిపించిన టీజర్ నందమూరి అభిమానులనే కాదు.. మాస్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా సినిమా ఉండబోతోందన్న సంకేతాల్ని ఈ టీజర్ అందించింది. ఐతే టీజర్లో అన్నీ ఓకే కానీ.. బాలయ్య పేల్చిన డైలాగే జనాలు తలలు పట్టుకునేలా చేసింది. ‘‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్దీ’’.. ఇదీ బాలయ్య చాలా ఆవేశంగా చెప్పిన డైలాగ్. ఐతే దీని అర్థమేంటో.. పరమార్థమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.

నంది.. పంది.. పగిలిపోద్ది అంటూ రైమింగ్ చూసుకున్నారు కానీ.. ఈ డైలాగ్‌ అయితే అర్థవంతంగా లేదు. నాన్ సింక్ లాగా అనిపిస్తోంది. సినిమాలో సందర్భాన్ని బట్టి ఏమైనా సరిగ్గా కుదిరిందో ఏమో తెలియదు కానీ.. టీజర్లో చూస్తే మాత్రం డైలాగ్ మీనింగ్ లెస్‌గా అనిపించింది. ఈ డైలాగ్ గురించి పెద్దగా ఆలోచించని వాళ్లు ఆహా ఓహో అనేస్తున్నారు కానీ.. కాస్త ఆలోచించి చూస్తే మాత్రం డైలాగ్ అంత బాగాలేదని అర్థమైపోతుంది.

ఈ డైలాగ్ చెప్పేటపుడు బాలయ్య ఎక్స్‌ప్రెషన్ కూడా మామూలుగా అనిపించింది. పవర్ ఫుల్ డైలాగులు చెప్పేటపుడు బాలయ్య ఒక మూసలో వెళ్లిపోతున్న ఫీలింగ్ జనాలకు కలుగుతోంది. బాలయ్య-బోయపాటి కలయికలో వచ్చిన తొలి రెండు సినిమాలూ బ్లాక్‌బస్టర్లే అయ్యాయి. ఐతే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. ఊరికే మాస్ మాస్ అంటే సరిపోదు. ఈసారి కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయకుంటే కష్టమే.