జగన్ దెబ్బకు థియేటర్లు మూత

లాక్ డౌన్ దెబ్బకు కుదేలైన థియేటర్లను ఆదుకోవడానికి ఇటీవలే రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. లాక్ డౌన్ టైంలో అసలు పనే చేయకుండా ఖాళీగా ఉన్న థియేటర్లకు విధించిన నామమాత్రపు ఎలక్ట్రిసిటీ బిల్లులను మాత్రమే ప్రభుత్వం రద్దు చేసింది. అదేమంత ఉపయుక్తమైన ప్యాకేజీ కాకపోయినా.. ఆ మాత్రమైనా ప్రభుత్వం తమకు ఊరటనిచ్చిందని సంతోషించారు థియేటర్ల యజమానులు.

కానీ ఇప్పుడు థియేటర్ల ఉనికినే ప్రశ్నార్థకం చేసే నిర్ణయంతో జగన్ సర్కారు గట్టి దెబ్బే కొడుతోంది. జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాను దెబ్బ కొట్టే క్రమంలో ఏపీలో థియేటర్ల వ్యవస్థకు ప్రభుత్వం గండి కొడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పేరున్న కొత్త సినిమాలు రిలీజైనపుడు టికెట్ల రేట్లు పెంచి అమ్ముకోవడం మామూలే. ప్రభుత్వం ఇందుకు అనుమతులు ఇస్తూనే ఉంటుంది.

ఏప్రిల్ తొలి వారంలో రిలీజైన ‘వైల్డ్ డాగ్’కు సైతం టికెట్ల రేట్లు పెంచారు. కానీ ‘వకీల్ సాబ్’ విషయానికి వచ్చేసరికి నియంత్రణ మొదలైంది. అధిక రేట్లకు అడ్డు కట్ట వేయడం వరకు ఓకే కానీ.. ఎప్పుడో దశాబ్దం కిందటి జీవోను బయటికి తీసి అప్పటి రేట్లను ఇప్పుడు అమలు చేయాలని ప్రభుత్వం హుకుం జారీ చేయడమే విడ్డూరంగా అనిపిస్తోంది. దీని ప్రకారం గ్రామ పంచాయితీ పరిధిలోని ఏసీ థియేటర్లలో రూ.20, 15, 10 చొప్పున.. నాన్ ఏసీ థియేటర్లలో రూ.15, 10, 5 చొప్పున టికెట్లు రేట్లు ఉండాలని పేర్కొనడం గమనార్హం. నగర పంచాయితీలో ఏసీ థియేటర్ గరిష్ట ధర రూ.35కు.. మున్సిపాలిటీల గరిష్ట ధర రూ.70కి మించకూడదని ఇందులో పేర్కొన్నారు.

ఈ రేట్లతో థియేటర్లను నడపడం అసాధ్యం అని ఎగ్జిబిటర్లు తేల్చి చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే థియేటర్లను మూసివేయడం మినహా మార్గం లేదంటున్నారు. గ్రామ పంచాయితీ కిందికి వచ్చే గజపతినగరంలో రూ.20, 15, 10 ధరలతో టికెట్లు అమ్మడం సాధ్యం కాదంటూ అక్కడున్న రెండు ఏసీ థియేటర్లను యాజమాన్యాలు మూసివేయడం గమనార్హం. ఏపీ సర్కారు విధానం మారకుంటే ఏపీలో మరిన్ని థియేటర్లు ఇలా మూతపడటం గ్యారెంటీ అని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.