‘వకీల్ సాబ్’కు గుబులు పుట్టించే నిర్ణయం

మరి కొన్ని గంటల్లోనే ‘వకీల్ సాబ్’ థియేటర్లలోకి దిగబోతోంది. ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, అదనపు షోలకు అనుమతులు లభించలేదు. దీని ద్వారా ‘వకీల్ సాబ్’ ఆదాయానికి బాగానే గండి పడింది.

ఇప్పుడంతా తొలి వారాంతపు వసూళ్లే కీలకం కావడంతో టాక్‌తో సంబంధం లేకుండా మాగ్జిమం కలెక్షన్లు కొల్లగొట్టడం కోసం బెనిఫిట్ షోలు, అదనపు షోలు ప్లాన్ చేసుకున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు షాక్ తగిలింది. అదనపు షోల కోసం బుకింగ్స్ కూడా ఓపెన్ చేసి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ముందు రోజు వరకు ఏదో ఒక సమయంలో అనుమతులు వస్తాయని ఎదురు చూసి చూసి చివరికి నిరాశకు గురి కాక తప్పలేదు. రెగ్యులర్ షోలతోనే సినిమాను నడిపించుకోక తప్పేట్లేదు లేదు.

ఐతే కరోనా విజృంభణ చూస్తే ‘వకీల్ సాబ్’ను తెలుగు రాష్ట్రాల్లో ఇలా అయినా నడిపించుకోగలుగుతున్నందుకు సంతోషించాల్సిందే అన్నట్లుంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు ఒక్కొక్కటిగా 50 శాతం ఆక్యుపెన్సీ వైపు అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం గత వారమే 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని ప్రకటించింది. కానీ ‘యువరత్న’ సినిమాకు అప్పటికే 100 శాతం ఆక్యుపెన్సీతో బుకింగ్స్ పూర్తవడంతో చిత్ర బృందం విజ్హప్తి మేరకు ఈ నెల 6 వరకు పాత పద్ధతిని కొనసాగించేలా చూశారు. ఏడో తారీఖు నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ అమలవుతోంది. ‘వకీల్ సాబ్’కు కూడా ఇలాగే బుకింగ్స్ నడుస్తున్నాయి. దీని వల్ల ఆదాయానికి గండి తప్పట్లేదు.

ఇప్పుడు తమిళనాట సైతం తాజాగా 50 శాతం ఆక్యుపెన్సీ విధిస్తూ జీవో ఇచ్చారు. ఇది శుక్రవారం అక్కడ రిలీజవుతున్న ధనుష్ సినిమా ‘కర్ణన్’కు పెద్ద షాకే. తమిళనాట ‘వకీల్ సాబ్’ వసూళ్లపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపేదే. ఇదిలా ఉంటే.. పొరుగు రాష్ట్రాలు పరిస్థితి తీవ్రత అర్థం చేసుకుని 50 శాతానికి ఆక్యుపెన్సీని తగ్గిస్తున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మీదా ఒత్తిడి పడటం ఖాయం. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా 50 ఆక్యుపెన్సీ తెస్తారేమో అన్న భయం కలుగుతోంది నిర్మాతల్లో. ఈ వీకెండ్ తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. అదే జరిగితె.. ‘వకీల్ సాబ్’కే కాదు, ఆ తర్వాత వచ్చే సినిమాలకూ ఇబ్బందులు తప్పవు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)