సర్వం వకీల్ మయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర జాతరే. రిలీజ్ తర్వాత టాక్ ఎలా ఉంటుందో ఏమో కానీ.. విడుదల ముంగిట మాత్రం హంగామా మామూలుగా ఉండదు. హైప్ పతాక స్థాయికి చేరిపోతుంది. సాధ్యమైనంత త్వరగా సినిమా చూసేయాలని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంటుంది.

ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతుంటారు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్‌లోనూ పవన్ సినిమాను వేసేస్తుంటారు. మల్టీప్లెక్సుల్లోనూ మాగ్జిమం స్క్రీన్లు పవర్ స్టార్ సినిమాకు ఇచ్చేస్తారు. ‘వకీల్ సాబ్’ విషయంలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ జరగట్లేదు. అందులోనూ ఇది పవన్ రీఎంట్రీ మూవీ కావడం, లాక్ డౌన్ విరామం తర్వాత తెలుగులో రాబోతున్న తొలి భారీ చిత్రం కావడంతో హైప్ మామూలుగా లేదు.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ ‘వకీల్ సాబ్’ సినిమాతో నిండిపోనున్నాయి. మల్టీప్లెక్సుల సంగతలా ఉంచితే.. ఏపీ, తెలంగాణల్లోని సింగిల్ స్క్రీన్లు ఏవీ కూడా వేరే సినిమాను ప్రదర్శించే పరిస్థితి లేదు. ప్రతి థియేటర్లోనూ ‘వకీల్ సాబ్’నే ఆడించబోతున్నారు. మల్టీప్లెక్సుల్లో ఒకటీ అరా షోలు మినహాయిస్తే ‘వకీల్ సాబ్’యే నడవబోతోంది. మహా అయితే ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’కు ఒకట్రెండు షోలు విడిచిపెట్టి పెద్ద మల్టీప్లెక్సులన్నీ పవన్ సినిమాతో నింపేస్తున్నాయి. రెండు మూడు స్క్రీన్లు ఉన్న మల్టీప్లెక్సులైతే వేరే సినిమాకు అవకాశం ఇవ్వట్లేదు.

ఎన్ని షోలు అందుబాటులో ఉంచినా.. టికెట్ల అమ్మకం విషయంలో ఏ ఇబ్బందీ ఉండట్లేదు. పెట్టిన టికెట్లు పెట్టినట్లు అయిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే దాదాపు 400 షోలకు టికెట్లు అందుబాటులో ఉంచగా.. అందులో 90 శాతానికి పైగా బుకింగ్స్ పూర్తయ్యాయి. ఇంకా కొన్ని మల్టీప్లెక్సులు బుకింగ్స్ తెరవాల్సి ఉంది. వాటి కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ నెల 9న బాక్సాఫీస్ దగ్గర పవన్ ప్రభంజనం చూడబోతున్నామన్నమాటే.