తెలుగు సినిమాల్లో కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో నటించిన సినిమాలో అయినా హీరోయిన్ డామినేషన్ అన్నది అరుదుగా జరుగుతుంటుంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో మాత్రమే ఇలాంటివి చూస్తుంటాం. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్‌ను మించి సాయిపల్లవి హైలైట్ అయిన సంగతి తెలిసిందే. దాని తర్వాత శేఖర్ తీసిన లవ్ స్టోరి విషయంలోనూ ఇదే జరిగేలా ఉంది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతి ప్రోమోలోనూ సాయిపల్లవి డామినేషన్ చూశాం. ఈ సినిమాకు చైతూ కంటే కూడా సాయిపల్లవినే అట్రాక్షన్ అంటే అతిశయోక్తి కాదు.
ఇలా ఆమెకు ప్రాధాన్యం దక్కేందుకు అంగీకరించిన చైతూను కూడా అభినందించాల్సిందే. కేవలం సాయిపల్లవిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు రాబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఆమెకున్న క్రేజును ఇతర భాషల్లోనూ ఉపయోగించుకోవడానికి నిర్మాతలు మంచి ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నాయి.
పెద్ద హీరోలు నటించిన భారీ సినిమాలు మినహాయిస్తే.. తెలుగు చిత్రాలు ఒకేసారి ఇతర భాషల్లో రిలీజ్ కావడం అరుదు. అలా రిలీజ్ చేసినా నామమాత్రంగానే ఉంటుంది. అయితే లవ్ స్టోరి లాంటి మీడియం బడ్జెట్లో తెరకెక్కిన ఒక ప్రేమకథా చిత్రాన్ని ఈ నెల 16న ఒకేసారి తెలుగుతో పాటు మలయాళం, కన్నడ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తుండటం విశేషం. సాయిపల్లవి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది మలయాళఃలోనే కాగా.. దక్షిణాదిన అంతటా ఆమెకు క్రేజ్ ఉంది.
లవ్ స్టోరి మంచి విషయం ఉన్న సినిమాలా కనిపిస్తుండటంతో ఇతర భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయడానికి నిర్మాతలకు కాన్ఫిడెన్స్ వచ్చినట్లుంది. సాయిపల్లవి కోసం ఇతర భాషల ప్రేక్షకులూ సినిమా చూస్తారని భావిస్తున్నారు. సారంగ దరియా పాటకు భాషతో సంబంధం లేకుండా ఆదరణ దక్కుతుండటం కూడా ఈ ప్రయత్నానికి పురిగొల్పి ఉండొచ్చు. ఐతే తమిళంలో కూడా సాయిపల్లవికి మంచి క్రేజే ఉండగా.. ఆ భాషలో లవ్ స్టోరిని ఎందుకు రిలీజ్ చేయట్లేదో మరి?