‘వకీల్ సాబ్’లో ఎవరతను?


కరోనా విరామం తర్వాత.. టాలీవుడ్లోనే కాదు, మొత్తం ఇండియాలోనే రిలీజవుతున్న అతి పెద్ద చిత్రం ‘వకీల్ సాబ్’. ఇంకో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్ చేస్తే దాన్ని చూడ్డానికి అభిమానులు థియేటర్లకు ఎలా పరుగులు పెట్టారో.. థియేటర్ల బయట, లోపల ఎంత హంగామా నెలకొందో తెలిసిందే.

ట్రైలర్‌కే ఇలా ఉంటే.. ఇక సినిమా రిలీజైతే సందడి ఏ స్థాయిలో ఉంటుందో అంటూ అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ట్రైలర్లో పవన్ హీరోయిక్స్, మాస్ అంశాలు పెద్దగా కనిపించలేదు. ఎక్కువగా సినిమా కథేంటో చెప్పే ప్రయత్నమే జరిగింది. ఇక రిలీజ్ రోజు థియేటర్లకు వెళ్లే అభిమానులకు బోలెడన్ని సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయన్న ప్రచారం గట్టిగా సాగుతోంది.

‘పింక్’కు అదనంగా కలిపిన పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అదే పెద్ద సర్ప్రైజ్ అంటున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా ద్వితీయార్ధంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని.. అభిమానులు అది చూసి వెర్రెత్తిపోతారని సంకేతాలు ఇచ్చాడు. దీంతో ఏంటా సర్ప్రైజ్ అనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ ఒక క్యామియో రోల్ గురించే ఈ చర్చంతా అని అంటున్నారు.

ఒక మెగా హీరో సినిమాలో మెరవబోతున్నారని.. కొన్ని నిమిషాలు మాత్రమే ఆ పాత్ర ఉంటుందని.. అది మెగా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని అంటున్నారు. మరి ఆ క్యామియో చేసింది మెగాస్టార్ చిరంజీవా లేక ఆయన తనయుడు రామ్ చరణా లేక ఇంకెవరైనా మెగా హీరోనా అన్నది చూడాలి. దీని గురించి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి సోషల్ మీడియాలో. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే ఇంకో వారం ఆగాలి.