నేను క్రాంతి కుమార్ గారి దగ్గర “స్వాతి” అనే సినిమా కి కో డైరక్టర్ గా పనిచేసాను.. షూటింగ్ అయ్యాక డబ్బింగ్ మొదలైనప్పుడు డైరక్టర్ గా ఆయన రావాల్సిన అవసరం ఉండేది కాదు.. మొత్తం డబ్బింగ్ నేనే చెప్పించి సౌండ్ పిక్చర్ కి ప్యారలల్ చేసాక ఆయన ఒకసారి చూసి ఆయనకు తోచిన కరెక్షన్స్ చెప్పేవారు.. అవి మాత్రం ఒక కాల్షీట్ వేసి చెప్పించేవాళ్ళం.. ఆలా డబ్బింగ్ చెప్పించే క్రమం లో జగ్గయ్య గారు థియేటర్ కి వచ్చారు..
జగ్గయ్య గారు చాలా స్ట్రిక్ట్ గా.. గంభీరంగా ఉండేవారు.. ఆయన థియేటర్ లో ఉంటే వేరే ఎవ్వరూ మాట్లాడేవారు కాదు.. పిన్ డ్రాప్ సైలెంట్.. ఒక సారి పేపర్ మీదున్న తన డైలాగ్ చూసుకుని తెరమీద కదులుతున్న తన పిక్చర్ ని చూస్తూ ఆ డైలాగ్ ని చెప్పడం ప్రాక్టీస్ చేసేవారు.. తనకి కాన్ఫిడెంట్ కలిగాక రెండు రిహార్సల్స్ చెప్పేవారు..తరవాత టేక్ అని చెప్పి పర్ఫెక్ట్ గా చెప్పేవారు.. ఒకవేళ ఆయనకు నచ్చకపోతే ఆయనే వన్ మోర్ అని మరొకసారి చెప్పేవారు.. ఎప్పుడైనా సౌండ్ లో”ఎయిర్ బ్లో” వస్తే.. సొండ్ ఇంజనీర్ వన్ మోర్ అంటే చెప్పేవారు.. ఆలా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక చోట ఒక డైలాగ్ చెప్పారు..
నేను సౌండ్ ఇంజినీర్ రూమ్ లో వున్నా.. “వన్ మోర్ సార్” అన్నాను.. “ఎందుకు సొండ్ లో డిస్ట్రబెన్స్ వచ్చిందా” అని అడిగారు.. లేదు సార్ డైలాగ్ తప్పు అయ్యింది అన్నాను.. డైలాగ్ తప్పా.. ఏం తప్పు అన్నారు.. “యు క్యాన్ట్ డు ఇట్ ” అన్నారు… “మరి ఏం అనాలి” అన్నారు.. “యు కాంట్ డు ఇట్ అనాలి సార్” అన్నాను.. ఒకసారి లోపలికి వస్తావా అన్నారు.. నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది.. ఆయన్ని ఎవరూ వన్ మోర్ అడగరు.. తప్పు ఉంటే ఆయనే వన్ మోర్ అని అడిగి కరక్ట్ గా వచ్చేవరకు చెబుతారు.. అటువంటిది నేను వన్ మోర్ అడిగాను.. అయన లోపలికి రమ్మన్నారు… లోపల మైక్ ముందు నిలబడిఉన్న ఆయన పక్కన నిలబడ్డాను.. ఏం చదివావు నాగేశ్వరావు అన్నారు.. B com అన్నాను.. పాసయ్యావా అన్నారు.. అయ్యానని తల ఊపాను.. నేనేం చదువుకున్నానో తెలుసా అన్నారు..తెలుసు సార్ అన్నాను.. దానిని అలాగే ప్రొనౌన్స్ చేయాలి నాగేశ్వర్రావు.. లోపలికి వెళ్లి నెక్స్ట్ లూప్ వేయించు అన్నారు..
నేను అలాగే నిలబడి కాలి వేలితో నేలను రాస్తున్నాను.. “అదీ.. అదీ.. సార్.. మరీ..మరి.. ..అంటున్నాను.. ఆయన గ్రహించారు… నేను ఎదో చెప్పటానికి తటపటాయిస్తున్నట్టు.. లోపల లోపల తపన పడుతున్నట్టు.. చాలా సౌమ్యముగా బుజ్జగిస్తున్నట్టు “ఏంటి నాగేశ్వర్రావు.. నీ ప్రాబ్లమ్ ఏమిటి చెప్పు” అన్నారు.. సార్.. నేను b com తెలుగు మీడియం.. ఆంధ్రదేశం లో దాదాపు అరవై శాతం నాలాంటి వాళ్ళే వుంటారు.. మీ లాగా నాలెడ్జ్ వున్నవాళ్ళ శాతం నలభై శాతం అయినప్పటికీ.. వాళ్లలో సినిమాలు చూసేవాళ్ల శాతం ఐదు కి మించి ఉండదు.. కానీ నాలాంటి వాళ్లలో తొంభై శాతం సినిమాలు చూస్తారు.. వాళ్లంతా జగ్గయ్య గారు తప్పు చెప్పారు అంటారు.. దానికి జగ్గయ్య గారు పది సెకండ్స్ అయ్యాక ఇలా అన్నారు.. “నాగేశ్వర్రావు..నీ ఆర్గ్యుమెంట్ నాకు నచ్చింది.. బాగా చెప్పావ్.. I appriciate you… కానీ నీలాంటి తొంభై శాతం మందిని సంతృప్తి పరచడం కోసం జగ్గయ్య తప్పు చెప్పాడు అని నాలాంటి ఒక్కడితో కూడా అనిపించుకోలేను.. అది ఒకే . నెక్స్ట్ లూప్ వెయ్యమని చెప్పు” అన్నారు.. అది ఆయన సంస్కారం..
జగ్గయ్య గారి గురించి.. ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామం లో జన్మించారు.. గుంటూరు ac కాలేజ్ లో చదివారు.. ఎన్టీఆర్ ఈయన ac కాలేజ్ లో సహాధ్యాయులు. . ఆయన 11 సంవత్సరాల వయసులోనే “సీత” అనే హిందీ నాటకం లో లవుడి పాత్ర పోషించారు.. స్వయంగా ఆయన రాసిన “బలిదానం” అనే నాటకం లో అప్పటి వరకు నాట్యానికే పరిమితమైన సావిత్రి ని రంగస్థల నటిగా తీర్చిదిద్దారు.. కాలేజ్ లో ఎన్టీఆర్ తో కలిసి నాటకాలు ప్రదర్శించారు.. వరుసగా మూడు సంవత్సరాలు ఉత్తమనటుడిగా అవార్డు అందుకున్నారు.. డిగ్రీ పూర్తి అయిన వెంటనే రేడియా లో వార్తలు చదివే వుద్యోగం చేశారు.. వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అంటే జనం రేడియా చుట్టూ గుమిగూడి వినేవాళ్ళు అప్పట్లో… ఆయనను కంచు కంఠం జగ్గయ్య అనేవారు.. కళావాచస్పతి అనేది ఢిల్లీ లోని అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ డాక్టరేటు.. రవీంద్రనాధ్ రచించిన నోబుల్ బహుమతి పొందిన గీతాంజలిని తెలుగు లోకి తర్జుమా చేశారు.. పార్లమెంటుకు ఎన్నికైన తోలి దక్షిణాది నటుడు.. ఆయన నటించిన అనేక సాంఘీక చిత్రాలతోపాటు అల్లూరి సీతారామరాజు పాత్ర తో ఆంధ్రుల హృదయాలలో చిరస్మరనీయుడు జగ్గయ్య గారు