పెళ్లి తర్వాత సినిమాలు.. మెహ్రీన్ మాటేంటి?

ఈ మధ్య బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సౌత్ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వరుణ్‌కు పెళ్లి కావడంతో ఒక మంచి ఆర్టిస్టు ఇండస్ట్రీకి దూరం అయిపోయాడని, అతడి కెరీర్ ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడం బాధాకరమని ఆమె ఆ పోస్టులో వ్యాఖ్యానించడం విశేషం.

మామూలుగా హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే వాళ్ల కెరీర్ ముగిసిపోయినట్లు చాలామంది వ్యాఖ్యానిస్తుంటారు. హీరోల విషయంలో మాత్రం ఇలా జరగదు. దీనిపై ఆమె వ్యంగ్యంగా ఈ పోస్టు పెట్టింది. ఒకప్పుడు హీరోయిన్లు చాలామంది పెళ్లి కాగానే సినిమాలకు గుడ్‌బై చెప్పేసేవాళ్లు. కొందరు సినిమాల్లో కొనసాగాలని అనుకున్నా.. పెళ్లయిన హీరోయిన్లకు ఇండస్ట్రీ నుంచి పెద్దగా ప్రోత్సాహం ఉండేది కాదు. ఈ నేపథ్యంలోనే శ్రద్ధ అలాంటి పోస్ట్ పెట్టింది.

కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. పెళ్లయ్యాక కూడా చాలామంది విజయవంతంగా కెరీర్‌లను కొనసాగిస్తున్నారు. కరీనా కపూర్, దీపికా పదుకొనే, శ్రియ, సమంత, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఇందుకు ఉదాహరణ. వీరి స్ఫూర్తితో టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకుంది. ఆమె రాజకీయ నాయకుడైన భవ్య బిష్ణోయ్‌తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

కెరీర్ బాగా సాగుతున్న సమయంలో, ఈ వయసులో పెళ్లేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు కానీ.. మెహ్రీన్ మాత్రం వివాహానికి ఇదే సరైన సమయం అనుకుంది. రాజకీయ నాయకుడి కుటుంబంలోకి వెళ్తున్న ఆమె ఇక సినిమాల్లో నటించదేమో అనుకున్నారు. కానీ మెహ్రీన్ మాత్రం ఈ సందేహాలకు తెరదించుతూ.. తాను పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని, అందుకు తన భర్త నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని, వ్యక్తిగత-వృత్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తానని స్పష్టం చేసింది. త్వరలోనే భవ్యతో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు రెడీ అవుతున్నట్లు ఆమె వెల్లడించింది.