జాతిర‌త్నాలు హింటిస్తే రంగ్ దే అల్లుకుపోయింది

మొత్తానికి యుఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ బాగానే పుంజుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. మిగ‌తా భాషా చిత్రాలకు ఇంకా అక్క‌డ ఊపు రాలేదు కానీ.. దేశీయ మార్కెట్లో మాదిరే యుఎస్‌లోనూ తెలుగు సినిమాకు మంచి ఆద‌ర‌ణే ద‌క్కుతోంది. కరోనా విరామం త‌ర్వాత క్రాక్, ఉప్పెన సినిమాల‌కు ఓ మోస్త‌రుగా వ‌సూళ్లు వ‌చ్చాయ‌క్క‌డ. తెలుగు సినిమాకు అక్క‌డ ఊపు తెచ్చిన చిత్రం జాతిర‌త్నాలు.

క‌రోనా బ్రేక్ త‌ర్వాత యుఎస్‌లో అత్య‌ధిక లొకేష‌న్ల‌లో రిలీజైన సినిమా ఇది. ప్రిమియ‌ర్లు కూడా భారీగానే వేశారు. ప్రేక్ష‌కుల నుంచి ఊహించ‌ని స్పంద‌న వ‌చ్చింది. కొన్ని గంట‌లు ప్ర‌యాణించి ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా చూశారు. ఈ క్ర‌మంలోనే జాతిర‌త్నాలు చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఫుల్ రన్లో ఏకంగా మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌తో ఔరా అనిపించింది ఈ సినిమా. మ‌రే ఇండియ‌న్ సినిమా కూడా ఇప్ప‌టిదాకా హాఫ్ మిలియ‌న్ మార్కును కూడా అందుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

జాతిర‌త్నాలు ఇచ్చిన ఊపును ఇప్పుడు రంగ్ దే మూవీ కొన‌సాగిస్తోంది. అక్క‌డి బాక్సాఫీస్ ఊపును ఈ సినిమా బాగా అందిపుచ్చుకుంది. ఈ చిత్రానికి యుఎస్‌లో రూ.1.5 కోట్ల మేర బిజినెస్ జ‌ర‌గ‌డం విశేషం. అందుకు త‌గ్గ‌ట్లే ఓపెనింగ్స్ కూడా వ‌స్తున్నాయి. ప్రిమియ‌ర్ల‌తో క‌లిపి శ‌నివారం అయ్యేస‌రికి రంగ్‌దే సినిమాకు 2.3 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్లు వ‌చ్చాయి. రూపాయ‌ల్లో చెప్పాలంటే గ్రాస్ రూ.1.67 కోట్ల దాకా వ‌చ్చింది. ఆదివారం అయ్యేస‌రికి రూ.2 కోట్ల గ్రాస్ మార్కును ఈ సినిమా దాటుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. బ‌య్య‌ర్లు త్వ‌ర‌లోనే లాభాల బాట ప‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

యుఎస్ తెలుగు ప్రేక్ష‌కులు కోరుకునే ఫ్యామిలీ ఎంట‌ర్టైన్మెంట్ ఉండ‌టం ఈ సినిమాకు ప్ల‌స్ అయింది. ఈ వారం వ‌చ్చిన మిగ‌తా రెండు తెలుగు చిత్రాల‌కు మాత్రం యుఎస్‌లో క‌నీస స్పంద‌న లేదు. అర‌ణ్య‌, తెల్ల‌వారితే గురువారం చిత్రాల‌ను వాళ్లు ప‌ట్టించుకోవ‌డం లేదు. అర‌ణ్య సినిమాకు ఇప్ప‌టిదాకా ప‌ది వేల డాల‌ర్లు కూడా వ‌సూలు కాలేదు. తెల్ల‌వారితే గురువారం ప‌రిస్థితి ఇంకా ద‌య‌నీయంగా ఉంది.