నాగార్జునకు అడ్వాంటేజ్.. ఆ సినిమా ఔట్


అక్కినేని నాగార్జునకు కొంచెం కాలం కలిసొచ్చినట్లే ఉంది. ఆయన సినిమాకు ముప్పుగా భావిస్తున్న చిత్రం రేసు నుంచి తప్పుకుంది. ఏప్రిల్ 2న నాగ్ మూవీ ‘వైల్డ్ డాగ్’కు పోటీగా గోపీచంద్ సినిమా ‘సీటీమార్’ కూడా రిలీజ్ కావాల్సిన సంగతి తెలిసిందే. మామూలుగా నాగార్జునతో పోలిస్తే గోపీచంద్ స్థాయి తక్కువే. కానీ ‘వైల్డ్ డాగ్’ క్లాస్ టచ్ ఉన్న థ్రిల్లర్ మూవీ. దానికి కొన్ని పరిమితులున్నాయి.

గోపీచంద్ ఫామ్‌లో లేకపోయినప్పటికీ అతడి సినిమా ‘సీటీమార్’ మాస్ మసాలా సినిమా కావడం, తమన్నా గ్లామర్ యాడ్ కావడంతో మాస్ ప్రేక్షకులు దీనికే ఓటు వేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ‘సీటీమార్’ బాక్సాఫీస్ దగ్గర ‘వైల్డ్ డాగ్’ను దెబ్బ కొడుతుందనే అంచనాలున్నాయి. ఐతే రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ ప్రమోషన్ల జోరు కనిపించకపోవడంతో ‘సీటీమార్’ అనుకున్న ప్రకారం వస్తుందా రాదా అనే సందేహాలు నెలకొన్నాయి.

ఆ సందేహాలకు తగ్గట్లే ఇప్పుడా సినిమా వాయిదా పడిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం అవుతుండటం వల్ల తమ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయట్లేదని ‘సీటీమార్’ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఐతే ఈ సినిమాకు చాలినన్ని థియేటర్లు దక్కకపోవడం కూడా వాయిదాకు కారణం అని అంటున్నారు.

తర్వాతి వారంలో ‘వకీల్ సాబ్’ రానుండగా.. ముందు వారం వచ్చిన ‘రంగ్ దె’కు పెద్ద సంఖ్యలో థియేటర్లు ఇచ్చారు. ‘వైల్డ్ డాగ్’ కోసం చాలా ముందే థియేటర్లు బుక్ అయ్యాయి. మరోవైపు తమిళ అనువాద చిత్రం ‘సుల్తాన్’కు సైతం థియేటర్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసి వారం తిరిగేసరికి ‘వకీల్ సాబ్’కు అందులో మేజర్ థియేటర్లు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు. ఐతే వేసవిలో ప్రతి వారానికీ సినిమాలు షెడ్యూల్ అయిన నేపథ్యంలో ‘సీటీమార్’ను ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ సినిమా వాయిదా పడటం ‘వైల్డ్ డాగ్’కు అడ్వాంటేజ్ అనడంలో సందేహం లేదు.