చరణ్ కోసం చెన్నైలో ఆఫీస్

Charan Shankar


రామ్ చరణ్ ఇంకా ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల్లో అతడి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా కలయికలో కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ‘ఆచార్య’లో చిరు, పూజా హెగ్డేలతో మరికొన్ని సీన్లు చేయాల్సి ఉంది. వచ్చే నెలా నెలన్నరలో ఈ పనంతా పూర్తి చేయాలని చూస్తున్నాడు చరణ్. ఆ తర్వాత అతడి ఫోకస్ మొత్తం శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా మీద ఉండనుంది.

ఐతే చరణ్ ఖాళీగా లేకపోయినా ఈ సినిమా కోసం దిల్ రాజు తన పాటికి తాను సన్నాహాలు చేసుకుపోతున్నాడు. శంకర్‌తో కలిసి ప్రి ప్రొడక్షన్ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన చెన్నైలో ఆఫీస్ కూడా తెరిచేసినట్లు సమాచారం. శంకర్ అండ్ టీం అక్కడే ఉండి ప్రి ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు గాను ఈ ఏర్పాటన్నమాట.

దిల్ రాజు కూడా ఎప్పుడు చెన్నై వెళ్లినా.. శంకర్‌ ఇంటికి వెళ్లి కలుస్తూ వస్తన్నాడు. ఇక తమ ఆఫీస్‌లోనే అన్ని పనులూ జరిగేలా, శంకర్‌ను కలిసేలా చూసుకున్నాడు రాజు. ‘ఇండియన్-2’ సంగతి ఇప్పుడిప్పుడే తేలేలా లేకపోవడంతో రామ్ చరణ్ అందుబాటులోకి రాగానే.. అతడితో సినిమాను మొదలుపెట్టేయాలని శంకర్ చూస్తున్నాడు.

ఇది శంకర్ కెరీర్లో ఎక్కువగా చేసిన పొలిటికల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు కథానాయికగా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఓ విదేశీ భామను తీసుకోబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి. శంకర్‌, చరణ్‌లకు ఉన్న గుర్తింపు వల్ల ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లోనే చేయాలనుకుంటున్నారు. బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని మీడియాలో వార్తలొస్తున్నాయి.