రంగ్ దెలో నేను విల‌న్ కాదు-కీర్తి సురేష్‌

రంగ్‌దె సినిమాలో హీరో హీరోయిన్లు నితిన్-కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీనే మేజ‌ర్ హైలైట్ లాగా క‌నిపిస్తోంది. సినిమా అంత‌టా వీళ్లిద్ద‌రి మ‌ధ్య గిల్లి క‌జ్జాలు ఉంటాయ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది. బ‌య‌ట కూడా త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లే నితిన్, కీర్తి ఒక‌రిపై ఒక‌రు పంచులేసుకుంటూ సినిమా ప్ర‌మోష‌న్‌ను న‌డిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా ఈ ఒర‌వ‌డి కొన‌సాగుతోంది. సినిమాకు సంబంధించి ఈవెంట్ల‌లో అయితే చెప్పాల్సిన ప‌ని లేదు.

క‌ర్నూలులో జ‌రిగిన ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ.. ఈ వేడుక‌కు కీర్తి డుమ్మా కొట్టిందంటూ కౌంట‌ర్ వేశాడు. త‌ర్వాత ఆమె ప్ర‌మోష‌న్ల‌కు రావ‌ట్లేదంటూ ట్వీట్ వేయ‌డ‌మూ తెలిసిందే. తాజాగా రాజ‌మండ్రిలో జ‌రిగిన రిలీజ్ ఈవెంట్లోనూ నితిన్-కీర్తి ఒక‌రిపై ఒక‌రు పంచ్‌లు వేసుకోవడం విశేషం.

రంగ్‌దె ట్రైల‌ర్ చూస్తే ఈ సినిమాలో తాను విల‌న్ అనిపించేలా ఉంద‌ని.. కానీ అది నిజం కాద‌ని అంది కీర్తి సురేష్‌. తాను అలా ప్ర‌వ‌ర్తించ‌డానికి కార‌ణ‌మేంటో సినిమా ద్వితీయార్ధంలో తెలుస్తుంద‌ని.. అది తెలియ‌కుండా దాచి పెట్టార‌ని ఆమె అంది. ట్రైల‌ర్లో క‌నిపించే త‌న ప్ర‌వ‌ర్త‌న అంతా ప్ర‌తీకారంలో భాగం అని.. అస‌లేం జ‌రిగింది, నితిన్ ఏం చేశాడ‌న్న‌ది సెకండాఫ్‌లో తెలుస్తుంద‌ని ఆమె అంది. సినిమాలో అస‌లు విల‌న్ నితినే అని తీర్మానించింది.

మ‌రోవైపు నితిన్ మాట్లాడుతూ.. కీర్తి రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌నే ఈ సినిమాలో చూపించార‌ని, ఆమె బ‌య‌ట అంద‌రినీ టార్చ‌ర్ చేస్తుంటుంద‌ని, అది చూసి ఇన్‌స్పైర్ అయి ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి అను పాత్ర‌ను తీర్చిదిద్దాడ‌ని, ఒక‌రకంగా చెప్పాలంటే రంగ్‌దె కీర్తి బ‌యోపిక్ అని వ్యాఖ్యానించ‌డం విశేషం. మొత్తానికి బ‌య‌ట నితిన్, కీర్తిల ఈ గిల్లి క‌జ్జాలు సినిమా ప్ర‌మోష‌న్‌కు మాత్రం బాగానే ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.