ఆ బేనర్లో మొట్ట మొదటి ఫ్లాప్

టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లలో గీతా ఆర్ట్స్ ఒకటి. దాదాపు నాలుగు దశాబ్దాల ఈ బేనర్లో సినిమాలు తీస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లతో భారీ చిత్రాలు తీసి పెద్ద విజయాలు అందుకున్న ఘనత ఆ సంస్థ సొంతం.

ఐతే ఇలా భారీ చిత్రాలకు పరిమితం కాకుండా.. చిన్న, మీడియం బడ్జెట్లలో సినిమాలు తీయడం కోసం కొన్నేళ్ల కిందట ‘జీఏ2 పిక్చర్స్’ పేరుతో కొత్త సంస్థను నెలకొల్పారు అల్లు అరవింద్.
అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌లో ప్రొడక్షన్ పనులు చూసే బన్నీ వాసు ఈ సంస్థ బాధ్యతలు చేపట్టాడు. యువి క్రియేషన్స్ భాగస్వామ్యంతో జీఏ2 నిర్మించిన తొలి చిత్రం ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్‌బస్టర్ అయి ఈ సంస్థకు శుభారంభాన్నందించింది. ఆ తర్వాత ఈ బేనర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ అయింది.

‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’; ‘ప్రతి రోజూ పండగే’.. ఈ సినిమా ఫలితాలేంటో తెలిసిందే. కన్నడలో ‘భలే భలే మగాడివోయ్’ రీమేక్ చేస్తే అది కూడా మంచి విజయం సాధించింది. ఇలా మొదలైనప్పటి సక్సెస్ స్ట్రీక్ కొనసాగిస్తున్న ఈ సంస్థను ఇప్పుడు తొలి పరాజయం పలకరించినట్లే ఉంది. జీఏ2లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘చావు కబురు చల్లగా’ అంచనాల్ని అందుకోలేకపోయింది.

ఈ సినిమా గురించి అల్లు అర్జున్ సహా అందరూ చాలా గొప్పగా చెప్పేశారు కానీ.. చివరికి చూస్తే అంత విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. జీఏ2కు ఉన్న గుడ్ విల్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తరుగా వచ్చాయి. కానీ నెగెటివ్ టాక్, రివ్యూలు సినిమాను దెబ్బ కొట్టాయి. రెండో రోజు నుంచి ఈ చిత్రానికి వసూళ్లు పడిపోయాయి. వీకెండ్ వరకు ఎలాగోలా నెట్టుకురావచ్చు కానీ.. తర్వాత సినిమా నిలబడ్డం కష్టంలాగే ఉంది. జీఏ2 ఖాతాలో తొలి ఫ్లాప్ జమ కావడం లాంఛనమే.