సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్ని నెలల కిందట రాజకీయ పార్టీ పెట్టడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుని.. హఠాత్తుగా ఆ విషయంలో మనసు మార్చుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు రాజకీయాల్లోకి రాలేనని తేల్చి చెప్పేశారు. ఆ నిర్ణయం అభిమానులను ఎంతగా బాధించిందో చెప్పాల్సిన పని లేదు.
రజినీ ఆ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి వారు నిరసనలు చేస్తూ వచ్చారు. రోడ్డు మీదికొచ్చి ఆందోళన బాట కూడా పట్టారు. కానీ కరోనా వల్ల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి దిగ్గజాన్ని కోల్పోయిన విషయాన్ని వాళ్లు మరిచిపోయారు. రజినీకి సైతం ఎప్పట్నుంచో అనారోగ్య సమస్యలున్న నేపథ్యంలో ఈ కరోనా కాలంలో ఆయనకు ఏదైనా సమస్య తలెత్తి ఆరోగ్యం విషమిస్తే అప్పుడు గుండెలు బాదుకునేది ఈ అభిమానులే. కాబట్టి తర్కంతో ఆలోచిస్తే రజినీ నిర్ణయం సరైందే అని అర్థమవుతుంది.
సినిమాలు చేయడానికి లేని ఇబ్బంది రాజకీయాలకు ఏంటి అని కూడా కొందరు వాదించారు. కానీ రజినీ ఏ పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొంటున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. తన కొత్త చిత్రం ‘అన్నాత్తె’ షూటింగ్‌ను రజినీ ఇటీవలే పున:ప్రారంభించారు. ఆ చిత్రాన్ని దీపావళికి షెడ్యూల్ చేసిన నేపథ్యంలో రజినీ ఇంకెంతో కాలం షూటింగ్ ఆపే పరిస్థితి లేదు.
ఐతే చెన్నైలో ఈ సినిమా షూటింగ్ సెట్లో రజినీ కోసం ప్రత్యేకంగా ఒక వైద్య బృందాన్నే పెట్టుకున్నారట. రజినీకి ఎప్పుడే సమస్య వస్తుందో తెలియని పరిస్థితుల్లో.. ఇలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. గత డిసెంబరులో హైదరాబాద్‌లో ‘అన్నాత్తె’ షూటింగ్ చేస్తుండగా.. టీంలో కొందరు కరోనా బారిన పడటం, రజినీకి బీపీ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు కనిపించడంతో ఆయన అత్యవసరంగా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం తర్వాతే ఆయన రాజకీయాలపై వెనుకంజ వేశారు. ఇప్పుడు సినిమా పూర్తి చేయడం తన బాధ్యత కాబట్టి రంగంలోకి దిగారు కానీ.. ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తే రజినీ రాజకీయాలకు దూరం కావడం ఎంత కరెక్టో అర్థమవుతుంది.