రానా చేయాలంటే ఆయ‌న్ని చేర్చుకోవాలి

హీరోగా కెరీర్ ఆరంభించి.. బాహుబ‌లితో విల‌న్ పాత్ర‌కు మారి.. మ‌ధ్య‌లో కొన్ని స్పెష‌ల్ క్యారెక్ట‌ర్లు కూడా చేసి త‌న కెరీర్‌ను భ‌లేగా చ‌క్క‌దిద్దుకున్నాడు ద‌గ్గుబాటి రానా. వివిధ భాష‌ల్లో పేరున్న ద‌ర్శ‌కులు అత‌ణ్ని దృష్టిలో ఉంచుకుని భిన్న‌మైన పాత్ర‌లు రాస్తున్నారు.

వాటిలోంచి త‌న ఇమేజ్‌ను పెంచే ప్ర‌త్యేక పాత్రల్ని ఎంచుకుని సాగిపోతున్నాడు రానా. మ‌ధ్య‌లో ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల రానా కొంచెం స్లో అయ్యాడు కానీ.. ఇప్పుడు మ‌ళ్లీ పుంజుకున్నాడు. క‌రోనా ప్ర‌భావం లేకుంటే అత‌డి కొత్త సినిమా అర‌ణ్య ఈపాటికి రిలీజ్ కావాల్సింది.

విరాట‌ప‌ర్వం కూడా విడుద‌ల‌కు సిద్ధం కావాల్సింది. కానీ రెంటికీ బ్రేక్ ప‌డిపోయాయి. ఈ ఖాళీ స‌మ‌యంలో క‌థ‌లు వింటూ కొత్త ప్రాజెక్టులు సెట్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు రానా. అత‌డి ముందుకు ఒక ఆస‌క్తిక‌ర రీమేక్ వ‌చ్చింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఇటీవ‌లే మ‌ల‌యాళ హిట్ అయ్య‌ప్ప‌నుం కోషియ‌నుం రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒరిజిన‌ల్లో పృథ్వీరాజ్ చేసిన పాత్ర కోసం రానాను ఫైన‌లైజ్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఐతే తాను ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి రానా ఓ కండిష‌న్ పెట్టాడ‌ట‌. త‌న తండ్రి సురేష్ బాబును ఈ సినిమాలో నిర్మాణ భాగ‌స్వామిగా చేర్చాలని.. పారితోష‌కం కాకుండా సినిమాలో వాటా తీసుకుంటాన‌ని చెప్పాడ‌ని స‌మాచారం.

సురేష్ వాళ్ల‌తో క‌లిస్తే డిస్ట్రిబ్యూష‌న్లో కూడా కలిసొస్తుంద‌ని భావించి వంశీ ఈ డీల్‌కు ఓకే అన్న‌ట్లు తెలుస్తోంది. సినిమాలో మ‌రో హీరో పాత్ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ పేరు వినిపించింది. ఐతే ఆయ‌న ఓకే అన్నాడో లేదో.. అస‌లు ఈ ప్ర‌పోజ‌ల్ ఆయ‌న వ‌ర‌కు వెళ్లిందో లేదో తెలియ‌దు. బాల‌య్య కాక‌పోతే ఎవ‌రో ఒక సీనియ‌ర్ హీరోనే ఈ పాత్ర‌ను చేయాల్సి ఉంటుంది.