శ్రీదేవి కూతురి సినిమా పరిస్థితి దయనీయం

ఓవైపు సౌత్ సినిమాలు.. ముఖ్యంగా తెలుగు చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఇక్కడ థియేటర్లు రీస్టార్ట్ అయిన కొంత కాలానికే వసూళ్లు ఊపందుకున్నాయి. సంక్రాంతికి ఎలా బాక్సాఫీస్ షేక్ అయిందో చూశాం. ఫిబ్రవరి-మార్చి లాంటి అన్ సీజన్లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు వసూఝళ్ల మోత మోగుతోంది. గత నెలలో ‘ఉప్పెన’, ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ సినిమాలకు అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. కానీ బాలీవుడ్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టాలీవుడ్లో కంటే ముందే.. అక్టోబరులో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు వచ్చినపుడే అక్కడ స్క్రీన్లు తెరిచారు. సినిమాలు నడిపిస్తున్నారు. కొత్త చిత్రాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు రావట్లేదు. ఏ సినిమాకూ పాజిటివ్ టాక్ రావట్లేదు. జనాల సందడి అసలేమాత్రం ఉండట్లేదు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘ఇందు కీ జవాని’; ‘మేడం చీఫ్ మినిస్టర్’ చిత్రాలకు కనీస స్పందన కరవైంది. ఇప్పుడు హార్రర్ కామెడీ ఫిలిం ‘రూహి’తో అయినా బాక్సాఫీస్ పరిస్థితి మారుతుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. ‘దడక్’, ‘గుంజన్ సక్సేనా’ లాంటి హిట్ల తర్వాత జాన్వి నటించిన చిత్రమిది. ఇంతకుమందు సూపర్ హిట్టయిన ‘స్త్రీ’ తరహాలో హార్రర్ కామెడీగా ఈ సినిమాను రూపొందించారు. రాజ్ కుమార్ రావు కీలక పాత్ర పోషించాడు. ఈ శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పూర్తి తిరస్కారం ఎదురైంది. సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. అసలు సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్యా చాలా తక్కువ. దేశవ్యాప్తంగాఈ చిత్రానికి తొలి రోజు రూ.3 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. షేర్ కోటిన్నర లోపే ఉంది. ఈ మొత్తంతో డిస్ట్రిబ్యూటర్లు ఏం చేసుకోవాలి. సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే శని, ఆదివారాల్లో కూడా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. వేసవి మొదలు కాబోతోంది. ‘రూహి’ సినిమాతో బాక్సాఫీస్‌కు ఊపొస్తే తర్వాత మరిన్ని చిత్రాలను రిలీజ్ చేస్తారనుకుంటే.. భవిష్యత్తుపై భయాలు రేకెత్తించే ఫలితాన్నందుకునేలా ఉందీ చిత్రం.