హీరో తెరమీద గొప్ప ప్రతిభ చూపిస్తాడు. ఎన్నో విన్యాసాలు చేస్తాడు. తనకు తానే సాటి. కానీ అక్కడ చూపించే ప్రతిభ అంతా ఒక భ్రమ అని అందరికీ తెలుసు. ఐతే తెరమీదే కాక బయట కూడా టాలెంట్ చూపించే హీరోలు చాలా తక్కువమందే ఉంటారు. అలాంటి హీరోల్లో అజిత్ కుమార్ ఒకడు. నటుడిగా అజిత్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ.. ఆయనలో మరెన్నో టాలెంట్స్ ఉన్నాయన్న సంగతి పెద్దగా ప్రచారంలోకి రాదు.
అజిత్ మంచి నైపుణ్యం ఉన్న రేసర్. అతను మోటార్ బైకులు, కార్లను ప్రొఫెషనల్ తరహాలో నడుపుతాడు. ఎప్పట్నుంచో అతను పోటీల్లోనూ పాల్గొంటున్నాడు. అంతే కాదు.. అజిత్ మంచి షూటర్ కూడా. ఇది కూడా ఏదో సరదాకి చేసే పని కాదు. ప్రొఫెషనల్ పోటీల్లో పాల్గొనేంత ప్రతిభ అతడి సొంతం. సినిమా షూటింగ్స్ లేనపుడు అతను బయటెక్కడా హడావుడి చేయకుండా మోటార్ రేసులకో, షూటింగ్ పోటీలకో వెళ్లిపోతుంటాడు. అందరిలో ఒకడిలా వెళ్లి పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు.
తాజాగా అజిత్ తమిళనాడు స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తుండటం విశేషం. ఈ పోటీల్లో అజిత్ పాల్గొంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను ఎయిర్ పిస్టల్ విభాగంలో ముందంజ వేశాడు. అతను తర్వాతి రౌండుకు చేరుకున్న స్కోరింగ్ షీట్‌ను పీఆర్వోలు ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు.
ప్రొఫెషనల్ షూటర్లతో పోటీ పడి వారికి దీటుగా ప్రదర్శన చేసి ముందంజ వేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా అజిత్ వయసిప్పుడు 49 ఏళ్లు. షూటింగ్‌కు వయసుతో ఏం పని అనుకోవచ్చు కానీ.. ఈ ఆటపై వయసు ప్రభావం ఉంటుంది. దీనికి ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరం. అజిత్ ఈ పోటీల్లో పతకం గెలుస్తాడా లేదా అన్నది తర్వాత.. అతడి స్థాయికి ఇలా వచ్చి షూటింగ్ పోటీల్లో పాల్గొనడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రొఫెషనల్ షూటర్లతో రాష్ట్రస్థాయిలో పోటీ పడి ప్రతిభ చాటుకోవడం అసాధారణం. ఈ విలక్షణతే అజిత్‌ను మిగతా స్టార్ల నుంచి భిన్నంగా నిలబెడుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates