బాలీవుడ్లో కొత్త వాళ్లను తొక్కేసే బ్యాచ్లో కరణ్ జోహార్ది ప్రధాన పాత్ర అని, అతనెప్పుడూ వారసత్వ అండ ఉన్న వాళ్లనే సపోర్ట్ చేస్తాడని, వాళ్ల కోసమే సినిమాలు తీస్తుంటాడని బాగా పేరు పడిపోయింది. గత ఏడాది సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడితే.. అందుక్కారణం పరోక్షంగా కరణ్ జోహారే అని.. అతను సొంతంగా ఎదిగిన సుశాంత్ లాంటి వాళ్లను తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటాడని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారి దెబ్బకు కొన్ని రోజులు సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్ కూడా అయిపోయాడు కరణ్.
ఐతే అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకులు మాత్రం కరణ్ జోహార్.. అవకాశాలు ఇస్తాడు తప్ప, అడ్డుకోడు అంటూ అతడికి సపోర్ట్ చేశారు. తన మీద పడ్డ ఈ ముద్రను చెరిపేసుకోవడానికో ఏమో కానీ.. కరణ్ ఇప్పుడు ఒక సంచలన ప్రకటనతో మీడియా ముందుకు వచ్చాడు. తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా 14 మంది కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఆ 14 మందితో ఒక ఫొటో, వీడియో షూట్ కూడా చేసి చాలా గ్రాండ్గా ఈ విషయాన్ని వెల్లడించాడు కరణ్. ఇన్నేళ్ల తమ ప్రయాణంలో 20 మంది దాకా యువ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశామని.. ఇప్పుడు ఒకేసారి 14 మంది కొత్త డైరెక్టర్లను లాంచ్ చేయబోతున్నామని.. వీళ్లు ఇండియన్ సినిమాను రీడిఫైన్ చేసే కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని కరణ్ వెల్లడించాడు.
ఒక ప్రొడక్షన్ హౌజ్ ఒకేసారి 14 మంది కొత్త దర్శకులతో ఒప్పందాలు చేసుకోవడం, సినిమాలకు సన్నాహాలు చేయడం.. ఇలా వారిని గ్రాండ్గా లాంచ్ చేయడం ఇంతకుముందెన్నడూ భారతీయ సినీ పరిశ్రమలో చూడని చిత్రమే. తాను కొత్త వాళ్లకు ఎలా అండగా నిలుస్తానో చాటి చెప్పడానికి కరణ్ జోహార్ ఒక ప్రణాళిక ప్రకారం ఈ లాంచింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కరణ్ సంస్థనుంచి ఈ ఏడాది సూర్యవంశీ, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలు రాబోతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘లైగర్’లోనూ ఆయన నిర్మాణ భాగస్వామి. స్వీయ దర్శకత్వంలో ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు కరణ్.