సైనా సినిమా.. కిక్కు లేదు

బాగ్ మిల్కా బాగ్, ఎం.ఎస్.ధోని లాంటి స్పోర్ట్స్ బయోపిక్స్ అద్భుత విజయాన్నందుకున్నాక ఇండియాలో ఈ జానర్లో మరిన్ని సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అందులో ఒకటి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి, హైదరాబాద్‌ నుంచి బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రమే.. సైనా.

ఈ సినిమా ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయిందో తెలియదు. మార్చి 26న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ రోజు టీజర్ కూడా లాంచ్ చేశారు. ఐతే అది చూసిన ప్రేక్షకులకు ఏమంత ఎగ్జైట్మెంట్ కలగట్లేదు. ఇందుకు ప్రధాన కారణం.. సైనా పాత్రలో నటించిన పరిణీతి చోప్రానే అనడంలో మరో మాట లేదు. ఆమె ఈ పాత్రకు పూర్తిగా మిస్ ఫిట్ అనిపించేలా ఉంది. సైనా పోలికలు లేకపోవడం ఒక మైనస్ అయితే, తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఈ పాత్రకు తగ్గట్లు లేదు.

ముందు సైనా పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ను ఎంచుకున్నారు. ఆమె కొన్ని రోజులు బ్యాడ్మింటన్ సాధన కూడా చేసింది. సైనా అవతారంలోకి మారే ప్రయత్నం కూడా చేసింది. ఆమె అయితే సైనా పాత్రకు బాగా సూటయ్యేదేమో. కానీ ఆమె ఏవో కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకుంటే.. పరిణీతిని తీసుకున్నారు. ఆమె బొద్దుగా ఉంటుంది. సైనాతో ఏ రకంగానూ పోలికలుండవు. వీరి ముఖాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఐతే ఈ పాత్ర కోసం ఆమె పెద్దగా కసరత్తు కూడా చేసినట్లు లేదు. ముఖాన ఒక మచ్చ పెట్టేసుకుని ఇదే సైనా మేకోవర్ అన్నట్లుగా సినిమా మొదలుపెట్టేసినట్లుంది.

ఇక కథ పరంగా చూస్తే.. ప్రేక్షకులకు ఎగ్జైట్మెంట్ కలిగించే అంశాలు టీజర్లో పెద్దగా కనిపించలేదు. సైనా ఆట పరంగా గొప్ప క్రీడాకారిణే. ఆమె ఎన్నో గొప్ప ఘనతలు సాధించింది. ఐతే ఆమె జీవితం తెరిచిన పుస్తకం. తన గురించి అంతా మీడియాలో వచ్చేసింది. సినిమాలో కొత్త విషయాలేమీ చూపించేలా కనిపించడం లేదు. తనది మరీ పేద కుటుంబం కూడా కాదు. కాకపోతే ప్రపంచ బ్యాడ్మింటన్లో భారతీయ అమ్మాయిలకు పెద్దగా స్కోప్ లేని టైంలో ఆమె అడుగు పెట్టి అసాధారణ ఘనతలు సాధించింది. తర్వాతి తరానికి స్ఫూర్తిగా నిలిచింది. ఐతే ఆమె ప్రయాణాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి చూపించినట్లుందే తప్ప.. ఈ సినిమా తప్పక చూడాలనిపించే కిక్కు అయితే ‘సైనా’ టీజర్ ఇవ్వలేకపోయింది.