ఆ క్రేజ్‌ను చంపేసే సినిమాలివి


ఒక పరభాషా నటుడికి మన దగ్గర కొంచెం పేరు రావడం ఆలస్యం.. అతను తన భాషలో నటించిన పాత సినిమాలన్నింటినీ వరుసబెట్టి దించేయడం ఆనవాయితీ. ముఖ్యంగా తమిళ హీరోల విషయంలో ఇలా జరుగుతుంటుంది. ఏ తమిళ హీరోకు ఇక్కడ కొంచెం ఫాలోయింగ్ వచ్చినా సరే.. ఎప్పుడెప్పుడో చేసిన సినిమాలను పట్టుకొచ్చేస్తుంటారు. వాటిలో హిట్టయినవేవి, ఫ్లాప్ అయినవేవి అని చూడకుండా అనువాదం చేసి వదిలేస్తుంటారు.

ఐతే గత కొన్నేళ్లలో తమిళ స్టార్లకు తెలుగులో ఫాలోయింగ్, మార్కెట్ తగ్గిన నేపథ్యంలో కొంచెం మన వాళ్లు కూడా తగ్గారు. కానీ మళ్లీ ఇప్పుడు ఈ ఒరవడి మొదలవుతోంది. మాస్టర్, ఉప్పెన చిత్రాలతో విజయ్ సేతుపతికి మన దగ్గర మంచి క్రేజే వచ్చింది. దీంతో అతడి పాత సినిమాలను వరుసబెట్టి అనువాదం చేసేస్తున్నారు. రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

ఇప్పటికే ‘సూపర్ డీలక్స్’ అనే సినిమా అనువాద హక్కులను ఓ నిర్మాత తీసుకున్నాడు. ఇందులో సేతుపతి లింగమార్పిడి చేసుకున్న వ్యక్తిగా ఒక షాకింగ్ రోల్ చేశాడు. ఇందులో సమంత కీలక పాత్ర చేసింది. ఇది ఒక వెరైటీ సినిమా, సేతుపతి స్పెషల్ రోల్ చేశాడు కాబట్టి ఏమో అనుకోవచ్చు. కానీ తమిళంలో అతను నటించిన రెండు డిజాస్టర్ మూవీస్‌ను కూడా తెలుగులోకి తీసుకొస్తుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. ‘ఒరు నల్ల నాల్ పాత్తు సొల్రేన్’ పేరుతో తమిళంలో సేతుపతి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కింది. అందులో మన నిహారిక కొణిదెల కూడా ఓ క్యారెక్టర్ చేసింది. ఐతే ఆ చిత్రం తమిళంలో డిజాస్టర్ అయింది. దాన్ని తెలుగులోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు.

అలాగే ‘జుంగా’ పేరుతో వచ్చిన సేతుపతి మరో డిజాస్టర్ మూవీని కూడా తెలుగులోకి తెస్తున్నారు. అసలు ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటమే తగ్గిపోయింది. మన సినిమాలనే పట్టించుకోవట్లేదు. ఓటీటీలో బోలెడంత కంటెంట్ ఉంది. సేతుపతి సినిమాలు చూడాలంటే సబ్‌టైటిల్స్‌తో నేరుగా చూస్తారు. ఏ సినిమా పస ఎంతో జనాలకు బాగా తెలిసిపోతోంది. ఇలాంటి సమయంలో ఫ్లాప్ సినిమాలను అనువాదం చేసి ఏం ప్రయోజనం అన్నది అర్థం కాని విషయం. మరోవైపు ‘కేజీఎఫ్’తో క్రేజ్ తెచ్చుకున్న యశ్ సినిమాలను కూడా కన్నడ నుంచి ఇలాగే పట్టుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ కోవలోనే ‘గజకేసరి’ అనే పాత సినిమా ఒకటి వదులుతున్నారు.