టాలీవుడ్ స్టార్ హీరోల్లో సినిమాలు చేయడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరీ నెమ్మదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తెరంగేట్రం చేసి పాతికేళ్లు అవుతుంటే.. ఇప్పటిదాకా చేసిన సినిమాలు పాతిక మాత్రమే. పవన్ కంటే ముందున్న, తర్వాత వచ్చిన ఏ స్టార్ హీరో కూడా ఇన్నేళ్లలో ఇన్ని తక్కువ సినిమాలు చేయలేదు. సినిమా కమిట్ కావడంలో.. దాన్ని పట్టాలెక్కించడంలో.. అలాగే షూటింగ్ చేయడంలోనూ పవన్ ఆలస్యం చేస్తుంటాడు. సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడానికి ముందు కొన్నేళ్లయితే పవన్ మరీ బద్దకంగా ఉన్నాడు.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విషయంలో ఎంత ఆలస్యం జరిగిందో తెలిసిందే. పవన్ ఆలోచనలు ఎప్పుడెలా ఉంటాయో.. ఆయన ఎప్పుడు షూటింగ్‌కు వస్తాడో.. ఎప్పుడు బ్రేక్ తీసుకుంటాడో తెలియక తనతో సినిమాలు చేసేవాళ్లు అయోమయానికి గురయ్యేవాళ్లు. అలాంటి పవన్‌లో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఒకప్పటితో పోలిస్తే పవన్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు. తరచుగా పర్యటనలకు వెళ్తున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మరోవైపు సినిమాల కోసం కూడా బాగానే సమయం కేటాయిస్తున్నాడు. తన కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా పవన్ సినిమాల కోసం కష్టపడుతున్నాడిప్పుడు. గతంలో ఏ పనీ లేకపోయినా ఆయన షూటింగ్‌కు రావడం కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పొలిటికల్ కమిట్మెంట్ల మధ్య కూడా ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.
మంగళవారం ఉదయమే పవన్ మేకప్ వేసుకుని మరీ క్రిష్ సినిమా షూటింగ్ స్పాట్‌కు వచ్చాడట. హైదరాబాద్ శివార్లలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణాలో పాల్గొన్నాడు. మధ్యాహ్నానికి అక్కడ ప్యాకప్ చెప్పి శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్లాడు. అక్కడ గెటప్ మార్చుకుని ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ షూట్‌కు హాజరయ్యాడు. ఈ డెడికేషన్, కష్టం చూసి.. ఒకప్పటితో పోలిస్తే ఆయనలో ఎంత మార్పు వచ్చిందో అని పవన్ సన్నిహితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates