నాగ‌చైత‌న్య‌కు సాయిప‌ల్ల‌వి గండం

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేదు. ఎక్క‌డైనా హీరోల‌దే హ‌వా. నూటికి 70-80 సినిమాల్లో హీరోల పాత్ర‌ల ముందు హీరోయిన్ల క్యారెక్ట‌ర్లు తేలిపోతుంటాయి. నామమాత్రంగా అనిపిస్తాయి. మిగ‌తా 20-30 శాతం సినిమాల్లో హీరోయిన్ల పాత్ర‌లు చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఉంటాయి త‌ప్ప అందులో హీరోల‌ను డామినేట్ చేసేవి ఒక‌టీ అరా మాత్ర‌మే ఉంటాయి. హీరోయిన్లు పెర్ఫామ్ చేయ‌డానికి, వాళ్లు ఎక్కువ హైలైట్ కావ‌డానికి స్కోప్ ఉండేది లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మాత్ర‌మే. ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ డామినేష‌న్ అనేది అరుదుగా మాత్ర‌మే జ‌రుగుతుంటుంది.

తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు ఈ కోవ‌కే చెందుతాయి. ఆనంద్, గోదావ‌రి, ఫిదా.. ఇలా శేఖ‌ర్ చిత్రాలు చాలా వాటిలో హీరో కంటే కూడా హీరోయిన్ పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్యం క‌నిపిస్తుంది. న‌టిగానే కాక డ్యాన్స‌ర్‌గానూ మంచి పేరున్న సాయిప‌ల్ల‌వి ఫిదాలో ఎంత హైలైట్ అయిందో.. ఆ సినిమాకు ఎంత ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిందో తెలిసిందే. హీరో వ‌రుణ్ మీద ఆ సినిమాలో ఆమె స్ప‌ష్ట‌మైన పైచేయి సాధించింది.

ఇప్పుడు మ‌రోసారి క‌మ్ములతో ల‌వ్ స్టోరి సినిమా చేస్తున్న సాయిప‌ల్ల‌వి.. ఈసారి హీరోను పూర్తిగా ప‌క్క‌కు నెట్టేసేలా క‌నిపిస్తోంది. ప్రోమోల్లో ఆమె డామినేష‌న్ మామూలుగా లేదు. ఇప్పుడు సారంగ ద‌రియా పాట ప్రోమో, లిరిక‌ల్ వీడియో చూశాక ఈ సినిమాలో నాగ‌చైత‌న్య.. సాయిప‌ల్ల‌వి ముందు నిల‌వ‌గ‌ల‌డా అని సందేహాలు క‌లుగుతున్నాయి. గ‌త సినిమాల‌తో పోలిస్తే చైతూ ఇందులో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. బాగానే పెర్ఫామ్ చేసిన‌ట్లున్నాడు కూడా.

ఐతే ఎంత బాగా చేసినా.. సాయిప‌ల్ల‌వి పెర్ఫామెన్స్‌తో పోల్చి చూస్తే చైతూ త‌క్కువ‌గా క‌నిపించొచ్చు. పాట‌ల్లో ఆమె డామినేష‌న్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. సారంగ ద‌రియా పాట చూస్తే ఇది ఫిదాలో వ‌చ్చిండే పాట‌ను మించి వైర‌ల్ అయ్యేలా ఉంది. సినిమాలో పూర్తి పాట చూసి జ‌నాలు ఆగ‌డం క‌ష్ట‌మే. ఈ పాట‌లో డ్యాన్స్.. మిగ‌తా సినిమాలో పెర్ఫామెన్స్‌తో ఓవ‌రాల్‌గా సాయిప‌ల్ల‌వే హైలైట్ అయి చైతూ క‌నిపించ‌కుండా చేసేస్తుందేమో అన్న‌ది అక్కినేని అభిమానుల భ‌యం. మ‌రి చైతూ ఈ గండాన్ని అధిగ‌మిస్తాడో?