కొంచెం గ్యాప్ తర్వాత కమెడియన్ సునీల్ మళ్లీ హీరో వేషాల వైపు అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అతను ప్రధాన పాత్రలో ఇప్పటికే ‘డీటీఎస్’ అనే ఓ సినిమా మొదలైంది. ఆ చిత్రం తెలుగుతో పాటు కన్నడలోనూ తెరకెక్కుతుండటం విశేషం. ఆ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. కాగా ఆదివారం సునీల్ పుట్టిన రోజు సందర్భంగా అతను లీడ్ రోల్లో మరో కొత్త సినిమాను ప్రకటించారు. ఆ సినిమా పేరు ‘మర్యాద క్రిష్ణయ్య’ కావడం విశేషం.
ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య రూపొందించనున్నాడు. సునీల్ ఇందులో దొంగ పాత్రలో కనిపించనున్నాడు. అతను దొంగ చూపులు చూస్తున్నట్లు ఓ ప్రి లుక్ కూడా వదిలారు. ఏటీవీ ఒరిజినల్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఫిలిమ్స్.. ఈ మూడు సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. లక్ష్మీభూపాల మాటలు అందిస్తుండగా.. సాయికార్తీక్ సంగీతం సమకూర్చనున్నాడు.
‘మర్యాద కృష్ణయ్య’ అనే టైటిల్ చూడగానే అందరికీ సునీల్‌కు హీరోగా పెద్ద బ్రేక్ ఇచ్చిన ‘మర్యాద రామన్న’ గుర్తుకు రావడం సహజం. ‘మగధీర’ లాంటి ఆల్ టైం బ్లాక్‌బస్టర్ అందించాక రాజమౌళి తీసిన చిన్న సినిమా ఇది. ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్టే అయింది. ఈ సినిమా వరకు సునీల్ తన స్టయిల్లోనే కామెడీ చేసి అలరించాడు. కానీ తర్వాత అతను గాడి తప్పాడు. ‘పూలరంగడు’ అతణ్ని చెడగొట్టేసింది. మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడి దెబ్బ తిన్నాడు. ఆ తర్వాత హీరోగా వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొని వచ్చిన పేరంతా పోగొట్టుకున్నాడు. కొన్నేళ్ల కిందట హీరో వేషాలకు స్వస్తి చెప్పి మళ్లీ కామెడీ, క్యారెక్టర్ రోల్స్‌తో పాటు విలన్ పాత్రలోనూ నటించాడు. అవేవీ పెద్దగా వర్కవుట్ కాకపోయినా సునీల్‌కు అవకాశాలకైతే లోటు లేదు.
ఐతే ఇప్పుడు మళ్లీ హీరోగా ఎందుకు సాహసాలకు దిగుతున్నాడో మరి. అందులోనూ ఇప్పుడు అతను జత కట్టిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఏమాత్రం ఫాంలో లేడు. తొలి సినిమా ‘మనసంతా నువ్వే’తో అంచనాలు పెంచిన ఆదిత్య.. మధ్యలో ‘నేనున్నాను’ మినహాయిస్తే అన్నీ డిజాస్టర్లే ఇచ్చాడు. ఆయన ఈ మధ్య సినిమాలే తీయట్లేదు. కొన్నేళ్ల కిందట తీసిన ఓ సినిమా విడుదలకు కూడా నోచుకోలేదు. ఇలాంటి దర్శకుడితో కలిసి సునీల్ ఎలాంటి సినిమానందిస్తాడో చూడాలి.