యేలేటి బాక్సాఫీస్‌ కోట బద్దలు కొడతాడా?


చంద్రశేఖర్ యేలేటి.. దాదాపు రెండు దశాబ్దాల కిందటే ‘ఐతే’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు. అందరూ కొత్త వాళ్లతో అతను రూపొందించిన ఆ చిత్రం ఏ అంచనాలు లేకుండా విడుదలై అద్భుత విజయం సాధించాడు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు ఈ సినిమా చూసి షాకైపోయి సక్సెస్ మీట్‌కు వచ్చి చంద్రశేఖర్ యేలేటిని పొగడ్తల్లో ముంచెత్తాడు. తన సినీ మేధాశక్తికి పరీక్ష పెట్టిన సినిమాగా ‘ఐతే’ను అభివర్ణించాడు.

ఆ తర్వాత యేలేటి తీసిన ‘అనుకోకుండా ఒక రోజు’ అప్పటికి తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీగా నిలిచింది. దాని స్క్రీన్ ప్లే గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు టాలీవుడ్లో. ఆపై ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి వైవిధ్యమైన సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు యేలేటి. ఐతే దర్శకుడిగా ఎంత పనితనం చూపినా, కొత్తదనం అందించినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆయన తన స్థాయికి తగ్గ విజయాలందుకోలేదు. దీంతో యేలేటికి రావాల్సినంత పేరు రాలేదు. కొత్త సినిమా కోసం ప్రతిసారీ స్ట్రగులవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఐతే ‘మనమంతా’ తర్వాత యేలేటి చాలా గ్యాప్ తీసుకుని చేసిన ‘చెక్’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘భీష్మ’తో గత ఏడాది మంచి విజయాన్నందుకున్న నితిన్ ఈ చిత్ర హీరో. భవ్య క్రియేషన్స్ లాంటి పేరున్న సంస్థ రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించింది. ఎంత మంచి సినిమా తీసినా కమర్షియల్‌గా వర్కవుటయ్యేలా చూడటం దర్శకుడి బాధ్యత. ఇంతకుముందు యేలేటి చేసిన సినిమాల విషయంలో ఇది జరగలేదు.

ఐతే ‘చెక్’తో యేలేటి ఇన్నాళ్లూ తాను ఛేదించలేకపోయిన బాక్సాఫీస్ రహస్యాన్ని ఈసారి కచ్చితంగా ఛేదిస్తాడని సన్నిహితులు అంటున్నారు. ‘చెక్’ కమర్షియల్‌గా కూడా కచ్చితంగా పెద్ద విజయం సాధించే సినిమా అని వాళ్లు ధీమాగా చెబుతున్నారు. యేలేటి సైతం ప్రమోషన్లలో ఆ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చేలాగే ఉన్నాయి. కానీ సినిమా నిలబడాలంటే.. లాభాల బాట పట్టాలంటే మాత్రం మంచి టాక్ రావాలి. మరి మార్నింగ్ షో తర్వాత ‘చెక్’కు ఏ టాక్ వస్తుందో.. సినిమా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.